ఈ-తెలుగు స్టాల్ వద్ద సందర్శకుల సందడి
ఎప్పటివలే ఈ సంవత్సరం కూడా మన ఈ-తెలుగు స్టాల్ ప్రారంభమయ్యింది.
స్టాల్ లో కొత్త వాలంటీర్లు: ఎడమ నుంచి కుడి వైపుకు: ప్రణవ్ అయినవోలు , రహ్మానుద్దీన్ షేక్,మరియు భార్గవ రాం.
కొత్త బ్లాగర్లు ఉత్సాహంగా కార్యకర్తలుగా పనిచేయటానికి ముందుకొచ్చారు. సందర్శకులకు వారి కంప్యూటర్లో తెలుగు ఎలా రాయవచ్చో,చూడవచ్చో గురించి తెలియ చెప్పారు. తొలి రోజు వచ్చిన దర్శకులలో 5మంది కంప్యూటర్లో తెలుగు వ్రాయ వీలవుతుందని తమకు తెలియదని చెప్పారు. కొంతమంది తమకంప్యూటర్లో కొన్ని వెబ్ సైట్లు తెలుగులో సరిగా కనపడటంలేదని చెప్పారు. తెలుగుకై నడక కార్యక్రమానికి పరిమిత నిధులు ఖర్చయి పోవటం ఈ తెలుగు కార్యక్రమాలపై ప్రభావం చూపింది. ఈ సంవత్సరం సందర్శకులకు తెలుగు సాఫ్ట్వేర్ల సి.డి. లను, ఈ-తెలుగు నిర్వాహకులు ఇవ్వలేకపోతున్నారు. ఈ-తెలుగు సభ్యులు తమ వార్షిక చందాల బకాయిలు చెల్లించి సంస్థను గట్టెంకించాలి. తెలుగు భాషాభిమానులు ఈ-తెలుగు లో సభ్యత్వం తీసుకొని ఈ-తెలుగు కార్యక్రమాలకు తమ వంతు సహకారాన్నివ్వాలి.
ఈ-తెలుగు స్టాల్ లో నుంచున్న వారు -ఎడమ నుండి కుడి వైపు: కట్టా విజయ్ , చావా కిరణ్, ప్రణవ్,భార్గవ రాం,రహ్మానుద్దీన్ షేక్. కూర్చున్న వారు ఎడమ నుండి కుడి వైపు: వీవెన్, సి.బి.రావు
ఈ-తెలుగు సభ్యుల కృషి వలన నేడు లేఖిని,కూడలి, జల్లెడ, తెలుగు బ్లాగులు, తెలుగు వికీపిడియా,పలు వెబ్ సైట్ల స్థానికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సంవత్సరం "మీ కంప్యూటర్ కు తెలుగు నేర్పించడం ఎలా?" అనే అంశం పై ఈ-తెలుగు వారు పత్రిక విలేఖరులకు, రచయితలకు సదస్సులు విజయవంతంగా నిర్వహించారు.
హైదరాబాదు పుస్తక ప్రదర్శన ఆసక్తికరంగా ఉంది. ఈ సంవత్సరం చాలా విశేషాలున్నాయి. మిసిమి సాహిత్య మాసపత్రిక వారు తొలి సారి ఒక స్టాల్ (Arts and Letters) నిర్వహిస్తున్నారు. మిసిమి సంచికలు ఇక్కడ లభ్యమవుతున్నాయి.ఈ స్టాల్ లో మూడు పుస్తకాలు కొన్నాను. 1) వల్లభనేని అశ్వినీకుమార్ వ్యాసాలు -అంతర్వీక్షణం 2) సజీవ సాంప్రదాయంగా వేమన -స.వెం.రమేష్ 3) పురాణ ప్రలాపం -హరిమోహన్ ఝా (రెండవ ముద్రణ). వీటి పరిచయం వీలువెంబడి చేస్తాను. ఏవో కొన్ని పుస్తక దుకాణాల్లో తప్పించి మరెక్కడా కనపడని పాలపిట్ట మాస పత్రిక తాజా సంచిక (పాత సంచికలు కూడా) పాలపిట్ట స్టాల్ లో లభ్యమవుతుంది. సాహిత్యాభిమానులు తప్పక కొనవలసినవీ మిసిమి మరియు పాలపిట్ట.
Raga Ragini Trust Book Stall
అవధూత దత్తపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఆధ్యాత్మిక విషయాలపై పలు ప్రసంగాలు చేశారు. వీరు సంగీత పరిజ్ఞానము కలవారు కూడా. వీరి ఆధ్వర్యం లో వెలువరించిన Live in Hawaii -Music for Meditation and Healing అనే c.d. ఒకటి రాగ రాగిణి ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న దుకాణం లో కొన్నాను. స్వామి వారి సంగీత కచ్చేరి నేను గతంలో సికందరాబాదులో చూసి ఉన్నాను. ఆ రోజు వారి సంగీతం దివ్యానుభూతి కలిగించింది. ఈ సి.డి ఇంకా వినలేదు. దీనిపై మరో మారు వ్రాస్తాను. ప్రారంభమయిన కొద్ది గంటలకే ప్రదర్శన ముగిసింది. చూడవలసిన స్టాల్ లు ఇంకా చాలా ఉన్నాయి. పుస్తక ప్రియులు మరల మరల వస్తేనే కాని తృప్తి లభించదీ ప్రదర్శనలో.
తెలుగు బ్లాగరుల కినిగే స్టాల్ సందర్శన
ఈ తెలుగు స్టాల్ కాకుండా తెలుగు బ్లాగర్లు నిర్వహిస్తున్న కినిగె స్టాల్ ప్రత్యేక విశేషం. ప్రపంచంలో తొలిసారిగా, ప్రపంచంలో మీరెక్కడున్నా తెలుగు పుస్తకాలు మీకు అద్దెకు లభ్యమవుతాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ నెల 21 న ఈ వెబ్ సైట్ ప్రారంభమవుతుంది. వివరాలకై ఈ దిగువ ఇచ్చిన వెబ్ సైట్ లో చూడండి.
http://kinige.com/
లేదా
http://kinige.com/teblog/
కినిగే గురించిన విషయాలు ఎప్పటికప్పుడు తాజీకరింపబడగలవు.
నేటికింతే. త్వరలో పునర్దర్శనం.
తాజా కలం: ఈ-తెలుగు స్టాల్ లో పనిచేయుటకు ఉత్సాహవంతులైన వాలంటీర్లు కావలయును. తెలుగు భాషా సేవే కాకుండా ఎందరో రచయితలు, సినీ ప్రముఖులకు స్వయంగా ఈ-తెలుగు కార్యక్రమాల గురించి వివరించే అవకాశం కూడా ఉంది.
చిత్రం లో ఎడమనుంచి కుడి వైపుకు సతీష్ కుమార్ యెనమండ్ర, చిత్ర కవి భాస్కరభట్ల రవి కుమార్ (నేనింతే- కృష్ణానగరే మామా) ఇంకా కశ్యప్ -2009 ఈ-తెలుగు స్టాల్ లో.
4 కామెంట్‌లు:
నమస్తే రావు గారు. అక్కడకి రాలేకపోయినా మీరిచ్చిన వివరాలు, చెప్పిన విషయాలతో చాలా సంతోషం, తెలిసినవారిని తొందరించి ఏమి కొనాలో అడగటానికి కాస్త నోరూ పెగిలాయి. ధన్యవాదాలు.
@ఉష : మరువానికి దూరం కావటం అంటే జీవితం లో కొన్నింటికి దగ్గర కావటమే. ఈ మార్పు మీకు ప్రమోదాన్నిచ్చిందని తలంపు. పుస్తకాలు పారిజాతాలు. దూరంగా ఉన్నా వాటి సుగంధం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. 2009 లో అమెరికా మిత్రులను పుస్తక ప్రదర్శనలో కలవటం ఆనందం కలిగించింది. మీరు ఒక మారు డిశంబర్లో భారతదేశం రాగలరు.
పైన మీరు ప్రచురించిన ప్రతి ఫొటొ నెను ఉన్నాను, నెను మీకు తెలియదా...? ఇదె విషయాన్ని నెను ప్రస్తావించినపుడు (స్టాల్ నందు) చుపించండి అన్నారు... మరి ఇదెమిటి?
@కళాకారుడు: ఇది ఛాయాచిత్రంలో వ్యక్తులను గుర్తించటంలో పొరబాటు. అంతే. విచారం.సవరించాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి