గురువారం, ఏప్రిల్ 14, 2011

సంజీవదేవ్ స్వీయచరిత్ర 'తుమ్మపూడి' ఆవిష్కరణ

సమష్టి కృషితో సాంస్కృతిక పునరుజ్జీవం
‘తుమ్మపూడి’ సంకలనం ఆవిష్కరణ సభలో చలసాని
ఆంధ్రా కాంగ్రెస్.కాం సౌజన్యంతో
ఏప్రిల్ 4, 2011
తుమ్మపూడి (తెనాలి)/దుగ్గిరాల, న్యూస్‌లైన్: సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం మేధావులు, సాహితీవేత్తలు పూనుకోవాలని ప్రముఖ రచయిత, విరసం నేత చలసాని ప్రసాద్ పిలుపునిచ్చారు. అందుకు కళాతపస్వి సంజీవదేవ్ స్వీయచరిత్ర ఆవిష్కరణ సభ నుంచి కృషి ప్రారంభిద్దామని సూచించారు. సంజీవ్‌దేవ్ రచించిన ‘తెగిన జ్ఞాపకాలు’, ‘స్మృతిబింబాలు’, ‘గతంలోకి’ పుస్తకాలను తిరుపతికి చెందిన రాజాచంద్ర ఫౌండేషన్ ‘తుమ్మపూడి’ పేరిట సంకలనంగా తీసుకొచ్చింది. సంజీవదేవ్ స్వీయచరిత్ర అయిన ఈ మూడుభాగాల సంకలనానికి ఆయన స్వస్థలమైన దుగ్గిరాల మండల గ్రామమైన తుమ్మపూడి పేరిట నామకరణం చేశారు.అక్కడి ఆయన నివాసం ‘రసరేఖ’లో సంజీవదేవ్ సతీమణి సులోచన సోమవారం సాయంత్రం పుస్తకావిష్కరణ చేశారు.

ఈ కార్యక్రమంలో చలసాని ప్రసాద్ మాట్లాడుతూ, ఒకప్పుడు చాపకింద నీరులా ఉండే ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, తర్వాత జేబులో తేళ్లలా, ఇప్పుడు నట్టింటి నాగుబాముల్లా పురివిప్పి ఆడుతున్నాయని చెప్పారు. వీటినుంచి ప్రజలకు విముక్తి కలగాలంటే సాంస్కృతిక పునరుజ్జీవమే మార్గమన్నారు. గోరా నాస్తికోద్యమం, కవిరాజు హేతువాదం, చలం, ఉన్నవ లక్ష్మీనారాయణ స్వేచ్ఛా ప్రభంజనం తర్వాతికాలంలో కమ్యూనిస్టు ఉద్యమానికి, సాంస్కృతిక చైతన్యానికి దోహదపడ్డట్టు గుర్తుచేశారు.

అనంతరం గొర్రెపాటి వెంకటసుబ్బయ్య, సంజీవదేవ్, కలిదిండి నారాయణరాజు, కాళోజి తదితరులు ‘సంక్రాంతి మిత్రులు’ పేరుతో తరచూ కలుసుకుని సాంస్కృతికోద్యమానికి సైనికుల్లా పనిచేశారని చెప్పారు. బ్రిటిష్ పాలకులు మన సంపదను దోచుకున్నా, బ్రౌన్ వంటి మహాశయులు కొంత మేలుచేశారన్నారు. ప్రస్తుతం ఒబామా సామ్రాజ్యవాదం వేయిపడగల నాగులా దేశంపై నాట్యం చేస్తోందని చెప్పారు.

ప్రకాశకులకు అభినందన.: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ రావెల సాంబశివరావు మాట్లాడుతూ ప్రకాశకులకు అభినందనలు తెలిపారు. ‘గతంలోకి’, ‘తెగిన జ్ఞాపకాలు’, ‘స్మృతిబింబాలు’ రచనలు కలిసి త్రివేణి సంగమంలా ఆంధ్రదేశపు సంస్కృతిని తెలియజేస్తుందని వివరించారు. చైతన్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి తన ప్రసంగంలో, ప్రకృతి ప్రేమికుడైన సంజీవదేవ్, స్వయంకృషితో రచయిత, కవి, చిత్రకారుడిగా, ఎదిగారని చెప్పారు. రాజాచంద్ర ఫౌండేషన్ నిర్వాహకుడు జుజ్జవరపు చంద్రమౌళి మాట్లాడుతూ, సంజీవదేవ్ స్వీయవాణిని జనం చేత చదివించాలన్నదే తమ అభిమతమని చెప్పారు. ఫౌండేషన్ ప్రతి నిధి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, పాఠశాల విద్య లేకుండా పల్లెటూరి వాతావరణంలో ఉంటూ సంజీవదేవ్ ఉన్నత శిఖరాలకు చేరుకున్నారంటే అందుకు పూర్వజన్మ సుకృతమే కారణమై ఉంటుందన్నారు. 

ఎన్.ఆర్.తపస్వి, షేక్ మొహిద్దీన్ బాచ్చా, ముత్తేవి రవీంద్రనాథ్‌లు సంజీవదేవ్ రచనల్లోని అంశాలను చదివి వినిపించా రు. శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు, జన సాహితి సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు, మండవ శ్రీరామమూర్తి, వసుమతి, బి.చిరంజీవిరావు, పెద్ది సత్యనారాయణ, డాక్టర్ కొత్త రవీంద్రబాబు, లెఫ్టిస్ట్ స్టడీ సర్కిల్ భరత్, సోషలిస్టు ఎన్‌వీ రమణయ్య, వెలనాటి సత్యనారాయణ, ఎన్.థామసయ్య, ‘రసరేఖ’ ఎడిటర్ ముంగర జాషువా, సీఆర్ ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ రావెల నవీన్, సీహెచ్ సురేష్, వీరమాచనేని సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Source:
http://modules.andhracongress.com/andhranewscongressdetails.aspx?url=/main/SportsDetailsNormal.aspx?catid=131952&subcatid=17&Categoryid=3



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి