ఆదివారం, అక్టోబర్ 07, 2007
సాహితీవనం -8
పరుచూరి శ్రీనివాస్ గారు రసమయి లో రాసిన "1948 లో ప్రభాకరశాస్త్రిగారు తిరుమల ఆలయ ఆవరణలోని ఒక నేలమాళిగ లో నాలుగు శతాబ్దాల పైగా దాగివున్న తాళ్లపాక వాగ్గేయకారుల సంకీర్తనలు గల రాగిరేకులను గుర్తించి బైటికి తీయించి, దేవస్థానం చేత వాటిని ప్రచురింప చేశారు." విషయం పై తమ అభిప్రాయం వెలిబుచ్చుతూ, అన్నమాచార్య కృతుల రాగిరేకుల గురించి, 1815 ప్రాంతంలో, ఆ రాగిరేకులు, గుడి ప్రాంగణంలోనే వున్నట్లు మనకాధారాలున్నాయి అని తమ ఉత్తరంలో రాశారు. మరిన్ని వివరాలకు పాఠకులను కింద ఇచ్చిన లింక్, దాని అనుబంధ ప్రశ్నలు చూడ కోరుతాను.
http://groups.yahoo.com/group/racchabanda/message/17476
ఈ విషయమై పెక్కు వివాదాలున్న మాట వాస్తవమే. విషయ నిర్ధారణ కోసము మీ ఉత్తరాన్ని వెటూరి ఆనందమూర్తి గారికి పంపిస్తున్నాము. నవంబరు రసమయి లో తగు ప్రత్యుత్తరము ఉండగలదని ఆశిస్తున్నాము. అందులో విశేషాంశములు దీప్తిధార లో కూడా ప్రకటింపబడగలవు.
జులై 6 2007 న తెనాలిలో,తెలుగు రచయితలతో, ప్రధమ తెలుగు యునికోడ్ వర్క్ షాప్ నిర్వహించటానికి, తెలుగుభాషాబిమానుల సంఘం కార్యదర్శి సాయి లక్కరాజు గారు నాకు తోడ్పడినారు.వారి ఆధ్వర్యంలో వస్తున్న, శ్రీ స్వరలయ మాసపత్రిక అక్టోబర్ సంచిక వెలువడింది. ఇందులో మీ పిల్లలను మీరు ఎలా పెంచుతున్నారు అనే విషయం పై డా.దుగ్గరాజు శ్రీనివాసరావు, బెంగళూరిలోని, తెలుగు విజ్ఞాన సమితి విద్యాట్రస్ట్ చైర్మన్,ఏట్రియ,చాణ్యుక్య, కళింగ హోటళ్ల యజమాని ఐన చిన్నస్వామిరాజు పై ప్రత్యేక కథనం,డాక్టర్ యెల్లా వెంకటేశ్వర రావు పై వ్యాసం, చందమామ చిత్ర సమీక్ష,దసరా ప్రత్యేక వ్యాసం వగైరా కథనాలున్నాయి. శ్రీ స్వరలయ తాజా సంచికను ఇక్కడనుంచి ఉచితంగా download చేసుకోండి. http://www.swaralaya.net/swaralaya_oct_2007.zip
సాహితీవనం -5 ప్రశ్నలకు ఉత్తమ సమాధానాలిచ్చిన స్మైల్ గారికి అభినందనలు. ఆశ్చర్యకరంగా వీరొకరే సమాధానాలు పంపారు. అదీ తన బ్లాగులో, సమాధానాలతో పాటుగా వివరణ తో. ఇది చూసినవాళ్లు, ఇంక మేము సమాధానాలు పంపటానికి ఏముంది అని తలిచినట్లున్నారు. దానిని చూడని వారికోసం ఆ లింక్ దిగువన ఇస్తున్నాను. http://krishnadevarayalu.blogspot.com/2007/09/5.html
సాహితీవనం -5 ప్రశ్నలకు సమాధానాలు దిగువ ఇస్తున్నాను.
A) రష్యన్ సీత కథా సంపుటి రచయిత్రి
3) కందుకూరి వెంకట మహాలక్ష్మి
ఈ పుస్తకం గురించి ఇక్కడ చదవండి.
http://tinyurl.com/2ygdje ఈ పుస్తకం పేరు విచిత్రంగా ఉంది కదూ? ఈ పుస్తకానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?
B) "ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు" అని శ్రీశ్రీ రాసిన పాటకు ''ఏవి తల్లీ,నిరుడు మండిన ఎండుతాటాకుల్" అని పారొడి రాసిన కవి
4) ఆరుద్ర
స్వతంత్ర పత్రిక లో ఇది అచ్చయ్యింది. ఇంకా ఎన్నో అమూల్య రచనలు స్వతంత్ర లో ప్రచురితమయ్యాయి.
C) ఇది ఒక భక్తుడి, సాహితీకారుడి సమాధి
3) శ్రీత్యాగరాజ, తిరువాయూరు
1847 లో పరమపదించిన, వాగ్గేయకారుడు త్యాగరాజ సమాధి, తిరువాయూరు లో కావేరి నది ఒడ్డున ఆలనా, పాలనా లేకుంటే, దేవదాసి బెంగళూరు నాగరత్నమ్మ తన ఆస్తిని త్యాగరాజు సమాధి, ఆశ్రమం నిర్మాణానికి వినియోగించారు. త్యాగరాయ కృతులను సమాధి గోడలపై తెలుగులో చెక్కించి, సంగీత ప్రపంచానికి జనవరి25, 1925 న అంకితం చేశారు.నాగరత్నమ్మ సేవకు గుర్తుగా, ఆమె విగ్రహాన్ని, త్యాగరాజ మంటపానికి ఎదురుగా, ప్రతిష్టించారు.ఇప్పుడు ప్రతి సంవత్సరము అక్కడ, జనవరి,ఫెబ్రవరి మాసాలలో త్యాగరాజ ఉత్సవాలు సంగీతాభిమానులు, భక్తి శ్రద్ధలతో జరుపుతారు.
D) సుగాత్రి అంటే ఏమిటి?
2) మంచి శరీరం ఉన్నది
పెక్కుమంది దీని అర్థం మంచి గాత్రము గలది గా, తప్పుగా, అభిప్రాయ పడ్డారు.
E) కవి శేషెంద్ర శర్మ అభిమాన సంఘం
3) కవి సేన
1999 లో, కెంద్ర సాహిత్య అకాడమి బహుమతి గ్రహీత ఐన శేషేంద్ర శర్మ గారు, 1978 లో తన కవిసేన మానిఫెస్టో (ఆధునిక కావ్యశాస్త్ర) ను రచించారు. కవిత్వంపై ఒక గొప్ప విమర్శనా గ్రంధంగా ఇది పేరు పొందింది.
F) పంజరాన్ని నేనే, పక్షిని నెనే -కవితా సంపుటి రచయిత్రి
1) శిలాలోలిత
ఈ కవయిత్రి అసలు పేరు ' లక్ష్మి '.రేవతీదేవి రాసిన శిలాలోలిత అనే పుస్తక నామాన్నే,తన కలం పేరుగా స్వీకరించారు.
G) ఈ చిత్రం లో ఉన్నవారిని గుర్తించండి.
1) వెల్చేరు నారాయణ రావు
ఉత్తర అమెరికాలో,విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, మేడిసన్ లో తెలుగు సంస్కృతీచరిత్రలో ప్రధాన ఆచార్యుడిగా పనిచేస్తున్నారు.కొన్ని ప్రఖ్యాత తెలుగు రచనలను, ఆంగ్లంలోకి తర్జుమా చేశారు.
H) ఆలాపన రాసిన రచయిత
3) వి.ఎ.కె.రంగారావు
రంగారావు గారు గొప్ప సంగీతాభిమాని.ముళ్ళపూడి వెంకటరమణ మాటల్లో, "తినడం కోసం కాకుండా, వినడం కోసం బ్రతికే ఋషి". పెక్కు అరుదైన గ్రామఫోను రికార్డులు వీరు సేకరించారు. కొన్ని నాట్య ప్రదర్శనలిచ్చారు. కవి మల్లాది,సంగీతకారుడు సి.రామచంద్ర అభిమాని.చిక్కవరం జమీందారు, పలు పత్రికలలో సంగీతం పై క్రమంగా శీర్షికలు నిర్వహించారు.కృష్ణుడన్నా, కృష్ణతత్వం అన్నా మిక్కిలి ఇష్టం. పెక్కు గ్రామఫోన్ రెకార్డులకు sleeve notes రాసారు. ఆలాపన పేరుతో వార్త దిన పత్రికలో ఒక సంగీత శీర్షికను నిర్వహించారు. సినిమా, సంగీత విమర్శకుడిగా హైదరాబాదు వగైరా ప్రదేశాలలో ఉపన్యాసాలిచ్చారు.
I) చిత్రకారుడు, దర్శకుడు బాపు రూపొందించిన చీరలు ఈ చిత్రం లో వాడారు.
3) పెళ్లి పుస్తకం
రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రం లో చీరల రూపకల్పిగా నటించారు.
J) "మా నిజాం రాజు, జన్మ జన్మల బూజు" అని గర్జించిన రచయిత
2) దాశరధి కృష్ణమాచార్య
డాక్టర్ దాశరధి కవి, విమర్శకుడు, స్వాతంత్ర సమర యోధుడు.నిజామాబాద్ జైల్లో ఉండి " మా నిజాం రాజు, జన్మ,జన్మల బూజు " అని గర్జించాడు.
ఉత్తమ సమాధానాలిచ్చిన స్మైల్ గారికి దీప్తిధార వీరతాడు వేస్తున్నది. హై!హై! నాయకా.వీరికి రసమయి మాసపత్రిక సంచిక, దీప్తిధార అభినందనలతో అందగలదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
"1948లో ..." అన్నారు కాబట్టి, వాడపల్లి శాయిగారు పేర్కొన్న ఈ విషయాన్ని కూడ పరిశీలించగలరు.
http://groups.yahoo.com/group/racchabanda/message/17499
నిజానికి అడగాటానికి లక్ష ప్రశ్నలున్నాయి. వచ్చే పర్యాయం హైదరాబాద్ వెళ్తే ఆనందమూర్తిగారినే కలిసే ప్రయత్నం చేయాలి.
భవదీయుడు
శ్రీనివాస్
కామెంట్‌ను పోస్ట్ చేయండి