బుధవారం, అక్టోబర్ 03, 2007

సాహితీవనం -6


Click on photo to enlarge.

కొత్తపాళిగారు, తమ ఉత్తరంలో " టైటిలు మీరు వనం 2, 3, 4 అని పెడుతూ పోతే కొత్త క్విజ్జులు పెట్టారేమో అని ఆత్రంగా చూసి ప్రతిసారీ నిరాశ పొందాను ", అని రాస్తున్నారు.సాహితీవనం ఉద్దేశాలు తెలుపటానికి ఇది సరైన సమయమని తలుస్తాను. నేటి యువతరంలో పఠనాసక్తి తగ్గి పోతుంది. ప్రశ్నల సాకుతో,పాత, కొత్త పుస్తకాలపై, సాహితీ విషయాలపై , యువతరం దృష్టిని ఆకర్షించాలని చేసిన కుతంత్రమే, ఈ సాహితీవనం. ఇక్కడ,ప్రశ్నలు, జవాబుల కోసం కాకుండా, జవాబుల కోసం ప్రశ్నలు ఉంటాయి. దానర్ధం, జవాబుల రూపంలో, ఆసక్తికరమైన సాహితీ విషయాలు చర్చించటం. ఇంకోలా చెప్పాలి అంటే,ఒక ప్రశ్నకు జవాబు వెనుక కథ చెప్పటం. ఇందులో పెక్కు విషయాలు, ఇప్పటివారికి తెలియనివి కూడా వుంటాయి. కేవలం ప్రశ్నలు, జవాబులు అంటే, సాహితీవనం ఒక పరీక్షాకేంద్రంగా మిగిలిపోయే ప్రమాదముంది.పాఠకులు పరీక్షలు రాసే విధ్యార్థులు కారు. దీప్తిధార పాఠకులు విజ్ఞులు . నాకు తెలిసిన విషయాలు వారికి చెప్పే ఈ విధానంలో, నాకు తెలియని విషయాలను పాఠకులూ చెప్తున్నారు. ఈ ప్రక్రియ, ఇరువురికీ లాభదాయకమని తలంపు.

కొత్తపాళి గారు ఇంకో ఉత్తరంలో సాహితీవనం -5 ప్రశ్నలకు స్పందిస్తూ, ప్రశ్నలు కష్టంగా ఉన్నాయి అన్నారు. ఇది వాస్తవమే.సాహితీవనం -1(Set I) ప్రశ్నలకు జవాబులు,త్వర త్వరగా వస్తుంటే,ప్రశ్నలు సులభంగా ఉన్నాయని తలచి, (Set II లో) కొంచం కష్టమైన ప్రశ్నలు ఉంచాను. నా అంచనాలను తలకిందులు చేస్తూ, స్మైల్ (http://krishnadevarayalu.blogspot.com/2007/09/5.html) వాయువేగంతో జవాబులు పంపారు. నేను కఠినమనుకున్న ప్రశ్నలకు గూగుల్ అన్వేషణ యంత్ర సహాయం తో , సులభంగా జవాబిచ్చి, నన్ను ఆశ్చర్యం లో ముంచేసారు.ప్రశ్నలు రాసే సమయంలో, పాఠకుడు గూగుల్ వాడవచ్చన్న ఆలోచన నాకు తట్ట లేదు. కొత్తపాళీగారికీ తట్టి ఉండదు. Hats off to Google.

రసమయి

ఒక మంచి అభిరుచి గల పత్రికను మీకు పరిచయం చేయటానికి సంతోషిస్తున్నాను. ఈ పత్రిక పేరు రసమయి. నెల నెలా వస్తుంది. సంపాదకులు నండూరి పార్థసారథి. వీరు గతంలో ఆంధ్ర ప్రభ దిన, వార పత్రికలలో పని చేశారు.Journalist గా, రచయితగా వీరికున్న అనుభవం ఈ పత్రికను ఉత్తమ అభిరుచిగల పత్రికగా తీర్చి దిద్దింది.నేను గతంలో తెలుగు బ్లాగులో రాసినట్లు వీరు ఎంకిపాటల, నండూరి సుబ్బారావు గారి కుమారుడు కాదు. విశ్వరూపం, నరావతారం రచనలు,రాజు - పేద, టామ్‌సాయర్ వగైరా అనువాదాలు చేసిన నండూరి రామమోహనరావు గారి తమ్ముడు.


Nanduri Partha Sarathi Photo:cbrao

నంపాసా (నండూరి పార్థసారథి గారు) మంచి హాస్య రచయిత. సాహిత్య హింసావలోకనం, పిబరే హ్యుమరసం వగైరా పుస్తకాలు వీరివే. సంగీతం అంటే ప్రాణం. గ్రాంఫోన్ రికార్డులు 78 rpm, 33 1/3 వేగం గల రెకార్డులు వీరి వద్ద చాలా వున్నాయి.ఇప్పటికీ ఇంకా సేకరిస్తూనే వున్నారు. సంగీతం, సాహిత్యం, వాఙ్మయాలు,కవితలు,ప్రబంధాలు, చిత్రలేఖనం, శిల్పం,నాట్యం,సినీ పాటలు, సినిమాలు వగైరా అన్ని విషాయలపై వీరికి అవగాహన ఉంది.అందుకే రసమయిలో మనకు ఇన్ని వైవివిధ్యమైన విషయాలపై వ్యాసాలు గోచరిస్తాయి. రసమయి ప్రతి ఒక్క సంచికా collectors issue లా రూపొందిస్తారు.

ప్రతి సంచిక లో ఎదో ఒక విషయం పై ప్రత్యేక కేంద్రీకరణ (focus) ఉంటుంది.ఉదాహరణకు సెప్టెంబర్ 2007 నెల లో, దృష్టి, వేటూరి ప్రభాకర శాస్త్రి ఇంకా వారి కుమారుడు వేటూరి ఆనంద మూర్తి గార్ల పరిశోధనలు, రచనలపై ఉంది. 1948 లో ప్రభాకరశాస్త్రిగారు తిరుమల ఆలయ ఆవరణలోని ఒక నేలమాళిగ లో నాలుగు శతాబ్దాల పైగా దాగివున్న తాళ్లపాక వాగ్గేయకారుల సంకీర్తనలు గల రాగిరేకులను గుర్తించి బైటికి తీయించి, దేవస్థానం చేత వాటిని ప్రచురింప చేశారు.1949 ప్రాంతంలో ప్రభాకర శాస్త్రి గారు, ఆయన శిష్యుడు అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులవారు తాళ్లపాక కవుల సాహిత్య పరిశోధన సాగిస్తున్న తరుణంలోనే తిరుమల ఆలయ చంపక ప్రదక్షిణ ప్రాకారం వద్ద స్వరసహితంగా కొన్ని వాగ్గేయ రచనలు చెక్కిఉన్న రెండు పెద్ద రాతిబండలు వారి దృష్టికి వచ్చాయి. ఆ రచనలు తాళ్లపాక వారివిగా శాస్త్రి గారు గుర్తించారు. వాటిని పరిశీలించి, పరిష్కరించి ప్రకటించగలమని ఆయన చెప్పారు. కాని కొద్దికాలానికే దివంగతులు కావడంతో ఆ పని ముందుకు సాగలేదు.ఆయన తనయుడైన ఆనందమూర్తిగారి పూనికతో ఆ పని పూర్తయ్యింది. ఆసక్తికరమైన పెక్కు విశేషాలతో కూడిన, వీరి పరిశోధన వివరాలు ఈ సంచికలో చూడగలరు.

ఇంకా గుంటూరు శేషేంద్ర శర్మ రచనలపై కోవెల సంపత్కుమారాచార్య విశ్లేషణ, అరవిందుల సావిత్రి పై యజ్ఞన్న,హిందీ కవి ప్రదీప్ పై జానమద్ది హనుమచ్చాస్త్రి , షకీల్-నౌషాద్ క్లాసిక్స్ పై కస్తూరి మురళీ కృష్ణ వగైరా రచనలున్నాయి. ఇంకా బాలలకై కొన్ని ప్రత్యేక పేజీలున్నాయి.

షడ్రుచులతో కూడిన ఇలాంటి పత్రిక తెలుగు లో మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు. అక్టొబర్ '07 సంచికతో 8 వ సంవత్సరం లోకి, అడుగుపెడుతున్నది. ఈ పత్రిక పాత సంచికలు కూడా చదవతగ్గ అణిముత్యాలే. వాటి వివరాలు ఇక్కడ చూడండి.
http://rasamayi.com/50915/50157.html#issue

ఈ పత్రిక హైదరాబాదు లో విశాలాంధ్ర,నవయుగ,నవోదయ,గోపాల్ పబ్లికేషన్స్,తెలుగు బుక్ హౌస్ విక్రయశాలల లో మాత్రమే లభ్యమవుతుంది.బయటింకెక్కడా కానరాదు. ఆసక్తిగలవారు
చందాదారులవటమే ఉత్తమ మార్గంలా కనిపిస్తుంది.

విడి ప్రతి రూ.30/- వార్షిక చందా రూ.300/-

చిరునామా:

Rasamayi,
Nanduri Publications,
A-21, Journalist colony,
Jubilee Hills,
Hyderabad- 500 033

అమెరికాలో వార్షిక చందా $40/- సంప్రదించవలసిన చిరునామా:
డాక్టర్ మధుసారధి నండూరి
madhu@nanduri.com

7 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

మీ కుట్ర చాలా ప్రశంసనీయం రావు గారూ. నిజమే .. తెలుగు సాహిత్యం విషయాలు గూగుల్లో వెదకచ్చని, రానారె గూగులమ్మ పదాల తరవాత కూడ, నాకు తట్టలేదు. అది సరే గానీ, ఈ రసమయిని పరిచయం చేసి మంచి పని చేశారు. వెంటనే తెప్పించుకుంటాను. నంపాసా గారి సాహిత్య హింసావలోకనం చదివాను. అమోఘమైన సెటైరు.

braahmii చెప్పారు...

నండూరి పార్థసారధి గారు గొప్ప రచయిత. సాహిత్య హింసావలోకనం, రాంబాబు డైరి చదివాను. కాని తెలుగు పుస్తకాల ధరలపై మాత్రం నాకు కొంచెం కోపం ఉంది. ఒక పత్రికలో సాహిత్య హింసావలోకనం సమీక్ష లో దాన్ని చక్కగా చెప్పారు. అదేమిటంటే " తెలుగు పాఠకులు సంఘాలు గట్రా పెట్టుకోలేరని, తిరగబడలేరన్న ధైర్యం తోనే ప్రచురణకర్తలు ఇంతింత ధరలు పెడుతున్నారని" .నేను కూడా రసమయి చందా కడతాను.

C. Narayana Rao చెప్పారు...

ఒక కుతంత్రం ఈ సాహితీవనమైనప్పుడు, మీరు మరిన్ని కుతంత్రాలు పన్నాలని కోరుతున్నాను.

అజ్ఞాత చెప్పారు...

రావు గారు,
రసమయి కొత్త సంచికలు వస్తున్నాయా?
నాకు అనుకోకుందా పార్థసారథి గారితో మాట్లాడే అవకాశం వచ్చింది. హరివిల్లు పిల్లల పాటల పుస్తకంలోని పాటలు తెలుగు4కిడ్స్ లో present చెయ్యడం కోసం వారి అనుమతి కోరడం కోసం మాట్లాడాను.
(http://telugu4kids.com/TeluguPaatalu.aspx)
భయం భయంగానే, లేని ధైర్యం తెచ్చుకుని మాట్లాడాను. వారి అబ్బాయి గారికి రాశాను, కొత్త సంచిక పంపమని. అది కూడా ఎప్పటి మాట!
మళ్ళీ ప్రయత్నిస్తాను.

Sreenivas Paruchuri చెప్పారు...

"ఒక నేలమాళిగ లో నాలుగు శతాబ్దాల పైగా దాగివున్న తాళ్లపాక వాగ్గేయకారుల సంకీర్తనలు గల రాగిరేకులను గుర్తించి బైటికి తీయించ" ... క్షమించాలి! ఇలాంటి నిలబడని మాటల్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతారో/రాస్తారో నాకూహకందని విషయం!! 1815 ప్రాంతంలో ఆ రాగిరేకులు గుడి ప్రాంగణంలోనే వున్నట్లు మనకాధారాలున్నాయి (చూ: ఎ. డి. కాంప్‌బెల్, A grammar of the Teloogoo language : commonly termed the Gentoo 1816, 1820, 1849). పోతే, అప్పట్లో యువకుడైన ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారు స్వయంగా ఆ మాళిగలోకి దిగి ఆ రేకులను పైకి చేర్చారని మనకో కథ చెప్తారు. 2005 జనవరిలో ఆ పండితుణ్ణే నేను స్వయంగా అడిగాను... http://groups.yahoo.com/group/racchabanda/message/17476

"రసమయి" పత్రికను "యువ" (?) బ్లాగర్లకు పరిచయం చేయబూనడం ఎంతో ముదావహం. గత ఏడు సంవత్సరాలుగా వస్తున్న ఈ పత్రికను గురించి సంగీత, సాహిత్యాభిమానులైన "కొత్తపాళీ" గారికి తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా వుంది.

భవదీయుడు,
పరుచూరి శ్రీనివాస్

cbrao చెప్పారు...

@ లలిత, మరలా ప్రయత్నించారా? డాక్టర్ మధుసారధి నండూరి madhu@nanduri.com ను contact చేశారా? పార్థసారథి గారు మంచి బాల సాహిత్యాన్ని ప్రచురించారు. పిల్లల కోసం ' రంగుల మబ్బులు 'CD కూడా ప్రచురించారు.

అజ్ఞాత చెప్పారు...

రావు గారు,
పుస్తకంలో ప్రచురించిన e-mail address చూసి ముందుగా వారినే సంప్రదించానండి.
వారి సూచన మేరకే పార్థసారథి గారితో మాట్లాడాను.

తొందర్లోనే మళ్ళీ వారికి జాబు రాస్తాను, రసమయి subscription కోసం.
పిల్లల CD గురించి తెలియచేసినందుకు నెనర్లు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి