గురువారం, జనవరి 06, 2011

మహాభారతంలో స్త్రీలు-అప్పటి వివాహ రీతులు-4

సుభద్ర – తాను కోరిన వారికి నాల్గవ భార్యగా ఉండటానికి అతనితో పారిపోతుంది.

రచయిత 

ఎ. కృష్ణకుమార్, పిహెచ్.డి., డి.ఎస్.సి (ఆనర్స్) సుభద్ర వసుదేవుని పుత్రిక, కృష్ణ, బలరాముల సోదరి. ఆమె తన మేనత్త కొడుకైన అర్జునుడిని ప్రేమిస్తుంది. అర్జునుడు తన అజ్ఞాతవాసపు చివరి ఘట్టంలో ఆమె కుటుంబంతో గడుపుతాడు. అతడిని వివాహమాడతానని సుభద్ర కృష్ణునితో చెపుతుంది. అప్పటికే ద్రౌపదితో సహా అర్జునుడికి ముగ్గురు భార్యలున్నారు. కనుక బలరాముడు ఆ వివాహానికి ఒప్పుకోడని కృష్ణుడికి తెలుసు. అర్జునుడంటే కృష్ణుడికిష్టం. అందుకే సుభద్రను అతనితో పారిపొమ్మని సలహా యిస్తాడు. కాని అర్జనుడి మీద ఆమెను ఎత్తుకుపోయాడనే నింద పడకూడదని ఆమెను అర్జనుడికి రథసారధిగా  ఉండమంటాడు. ప్రేమించి పెండ్లాడటం ఆరోజుల్లో పరిపాటి. ఉదా: హిడింబి భీముడిని, ఉలూచి, చిత్రాంగద అర్జునుడిని పెండ్లాడటం. అవి గాంధర్వ వివాహాలన్నారు – స్వల్ప కాల కలయికలు, అందుమూలంగా బిడ్డల జననం. స్త్రీలు సుయోధులను  మోహించి, వారిని పెండ్లికి ఒప్పిస్తారు. అలాంటి స్త్రీలను తిరస్కరిస్తే అపాయకరమన్నట్లు చూపారు. వారి పిల్లలు కూడా భారత యుద్ధంలో పాలుపంచుకున్నట్లు చెప్పినా వారి గురించి ఆట్టే తెలియదు. హిడింబి ఒక రాక్షసుని సోదరిగా పేర్కొన్నారు. అయినా భీముడు ఆమె ద్వారా ఒక కొడుకుని కంటాడు. అతనే గొప్ప యోధుడైన ఘటోత్కచుడు. యుద్ధంలో పాండవులను కాపాడి తాను బలైపోతాడు.
అభిమన్యుడు – సుభద్ర కుమారుడు, ఉత్తరను వివాహమాడతాడు
ఉత్తర విరాటరాజు పుత్రిక. అర్జునుడు అజ్ఞాత వాసమప్పుడు బృహన్నలగా (ఆడవేషం) ఆమెకు సంగీతం, నాట్యం నేర్పిస్తాడు. బృహన్నలే అర్జునుడని తెలుసుకున్న విరాటరాజు ఉత్తరను వివాహమాడమని అర్జునుడిని కోరతాడు. ఇద్దరి వయస్సులో చాలా వ్యత్యాసం ఉన్నది కనుక తన కుమారుడైన అభిమన్యుడితో ఉత్తర వివాహం జరిపించమని అర్జునుడు సలహా యిస్తాడు. వయసు వ్యత్యాసం అర్జునుడి కాలంలో పరిగణనలోకి తీసుకోలేదు. ఉత్తర ప్రత్యేకత మరొకటి ఉన్నది. పాండవుల బిడ్డలలో ఉత్తర ఆమె కుమారుడు పరీక్షిత్తు -  ఈ యిద్దరే మహాభారత యుద్ధం తరవాత బతికి ఉంటారు. అలా భరతఖండం పరిపాలకులు ఉత్తర వారసులే.
ముగింపు
హిందూ పండితులు మహాభారతం చారిత్రకం అని చెపుతారు. వారలా అనడానికి అందులోని భగవద్గీత కారణం. అదంతా (కృష్ణుడు విష్ణువు అవతారమంటారు) వేదాంత ధోరణిలో బోధించినదే. కాని ఎన్నో నమ్మశక్యంకాని, భౌతికంగా సాధ్యం కాని సంఘటనలతో పాటు, కొన్ని పాత్రల అభూత కార్యసాధనలు భారతం నిండా ఉండటం వలన అది పాతకాలపు కథగానే ఒప్పుకోవలసి వస్తున్నది. భరత ఖండపు పూర్వీకుల అనుభవాలూ, జ్ఞాపకాల సమాహారం అది. చారిత్రకం అని నమ్ముతున్నారు. కొన్ని సంగతులు చదువుతుంటే రచయితకి భరతఖండంలోని అనేక ప్రాంతాలతో బాగా పరిచయమున్నట్లు తోస్తున్నది – ఆఫ్ఘనిస్తాన్ నుండి బర్మావరకు (పడమర నుండి తూర్పుకు) అటు కాశ్మీరు నుండి కేప్ వరకు (దక్షిణం) క్షుణ్ణంగా ఎదిగిన వ్యక్తిగా అనిపిస్తున్నాడు. స్త్రీలు, వారి సంస్కృతి, వారి వివాహ విధానాల్లాంటి విషయాలు చదువుతుంటే వివిధ ప్రాంతపు స్త్రీల ఆచార వ్యవహారాలు రచయిత పరిగణనలోకి తీసుకున్నాడనిపిస్తున్నది. వారి జీవిత విధానం ద్వారా వారి స్వభావాలు, మానసిక స్థితి బోధపడుతున్నాయి. స్త్రీలను వ్యక్తులుగా చూపినా వారు పురుషుల అజమాయిషీలో ఉన్నట్లే అర్ధం అవుతుంది.
ద్రౌపది, అంబా సోదరీమణుల స్వయంవరం ద్వారా పెద్దింటి స్త్రీలకు తమ భర్తల నెన్నుకునే స్వేచ్ఛ ఉన్నదని తెలుస్తున్నది. అందగత్తె అయిన సత్యవతి వివాహం వయసు మీరిన శంతను రాజుతో జరిపించే విషయంలో జరిగిన బేరసారాలు ఈ రోజుల్లో వధూవరుల కుటుంబాల మధ్య వివాహానికి ముందు జరుగుతున్న బేరసారాలవంటివే. బలవంతుడైన అంధ ధృతరాష్ట్రునితో వివాహానికి గాంధారి తండ్రి సమ్మతించటం, ఆమె బిడ్డలు గొప్ప రాజ్యానికి వారసులవుతారనే. ఆమె తక్కువ స్థాయిగల రాజు కుమార్తె. కుంతి దుర్వాసుడిచ్చిన వరాన్ని వాడుకునే తీరు ఈనాటి యువతుల మనస్తత్వాన్నికి దగ్గరగా ఉన్నదనిపిస్తుంది. యువతులు పేరుగాంచిన కుటుంబాలకు చెందిన, పలుకుబడి, డబ్బు కలిగిన యువకులను పెండ్లాడాలనుకుంటారు. తాను ఆహ్వానించిన సూర్యుడు ప్రత్యక్షమయినపుడు కుంతి, పరాశరుడు సత్యవతి పొందు కోరినప్పుడు ఆమె తెలిపిన అభ్యంతరాలు సమాజ కట్టుబాట్లవంటివే. వారు చరిత్ర హినులుగా అవుతారేమో అనే భయం వ్యక్తం చేస్తాడు. నీతి బాహ్యమని చెప్పరు. కాని రచయిత సృష్టించిన అద్భుతాల ద్వారా బిడ్డలు పుట్టినా వారిరువురి కన్యత్వం యధాతథంగా నిలిచి ఉంటుంది.
మాద్రి సోదరునికి కట్నకానుకలిచ్చి ఆమెను కొనుక్కునే పద్ధతి 20వ శతాబ్దం నాటి దాకా భారత దేశంలో కొన్ని ప్రాంతాలలో ఆచారంగా కొనసాగింది. అంబ సోదరీమణులనెత్తుకుపోవటం ఆదివాసీ ఆచారం. అంబను తాను వివాహమాడదలచిన వ్యక్తి దగ్గరకు తిరిగి పంపించటంలో స్త్రీకి భర్తను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉన్నట్లు తెలుస్తున్నది.  అర్జునుడి భార్యలు ఉలూచి, చిత్రాంగదల కథ కంటె సుభద్ర కథ మరో రకంగా మలచబడింది. మొదటి వారిద్దరిది గాంధర్వవివాహం సుభద్ర పారిపోయి అర్జునుడిని పెండ్లి చేసుకున్నది. ఆమె మహాభారతంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించింది. అందుకు కారణం ఆమె కృష్ణుని సోదరి కావటమే. కృష్ణుడు పాండవులకు సహాయపడటం ఇప్పటి కాలంలో అప్ప, చెల్లెళ్ళ భర్తలకు సాయమందించటం వంటిదే.
మహాభారతంలో వర్ణింపబడిన స్త్రీల వలన ఆకాలపు వారి వివాహరీతులూ, వారి లైంగిక జీవితాలూ ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. వివాహ పద్ధతులే కాకుండా సంతానాభివృద్ధికి అప్పటి స్త్రీ, పురుషులు నిర్వహించిన పాత్ర విశదంగా తెలిసింది. ఒక రాజు వీర్యం నదిలో చేప మింగటాన సత్యవతి జన్మించిందన్నాడు వ్యాసుడు. పురుష వీర్యం ఒక్కటే బిడ్డకు జన్మనిస్తుందనటం వైజ్ఞానికంగా తప్పు నిర్ధారణ. చేప కడుపులో ఒక బాలుడు, బాలిక ఉన్నారన్నాడు. బిడ్డలను కనే స్త్రీ పాత్ర యిక్కడ ఒక చేప నిర్వహించిందన్నమాట. ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు జన్మించటంలో సంభోగకాలంలో స్త్రీ ప్రవర్తన బిడ్డ మీద ప్రభావం చూపుతున్నదని తెలుస్తున్నది. కుంతి కొడుకుల విషయంలో వీర్యదాతలే వారి స్వభావాలను నిర్ణయించారు. వారి పెంపుదల మీద సమాజంలో వారి స్థానం ఆధారపడి ఉన్నది. కర్ణుడు సాధారణ వ్యక్తి చేతిలో పెరిగాడు గనుక సమాజపరంగా అతని విలువ తక్కువే. భీష్ముని అజమాయిషితో పెరిగిన ముగ్గురికీ గొప్ప శక్తులూ, విలువలూ ఆపాదింపబడ్డాయి. అభిమన్యుడికి పుట్టుక విషయంలో తల్లి, తండ్రి సమానమైన బాధ్యత చూపారు. అర్జునుడు యుద్ధ కౌశలం గురించి సుభద్ర ద్వారా కొడుక్కి నేర్పిస్తాడు. పిల్లల పుట్టుక, వారి పెంపకంలో స్త్రీ పురుషులు నిర్దుష్టమైన విధులు పాటించినట్లు రచయిత చూపాడు. మరి అది ఆకాలపు పద్ధతేమో.
మహాభారతంలో కులవ్యవస్థ, సమాజంలో స్త్రీల పాత్ర, దేశాన్ని పరిపాలించే విధానం, భౌతిక ప్రపంచంలో మానవుల స్వభావాలూ, మానసిక ధోరణులూ మొదలైన విషయాల గురించి ఎంతో సమాచారం ఉన్నది. అదంతా ఆధునిక విజ్ఞాన శాస్త్రపరంగా ఉపయోగపడటం వలన ఈ కావ్యం అన్ని కాలాలకు వర్తించేదిగా విలువ సంతరించుకున్నది.
తెలుగు అనువాదం
వెనిగళ్ళ కోమల
సమాప్తం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి