బుధవారం, మార్చి 03, 2010

యాకూబ్: ఎడతెగని ప్రయాణం

రెండు మతాలు ఆచారాలు, సంస్కృతులు ల లో మునిగితేలుతూ
భాయ్
మనుషులం
తర్వాతే మతములం
ఈ నేలపై సహజీవన పావురాళ్లం అంటూ సాధికారతతో చెప్పగలిగే యాకూబ్ కొత్త కవితల సంకలనం "ఎడతెగని ప్రయాణం " గా వెలువడింది. కవి యాకూబ్ గురించి గుడిపాటి పరిచయం ఇక్కడ.
మానవతే నా మతం అని చెప్పే యాకూబ్ కవితా సంకలనం "ఎడతెగని ప్రయాణం" ఆవిష్కరణ 2 మార్చి, 2010 న హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. సభకు విచ్చేసిన ఆహూతులకు కవయిత్రి, రచయిత్రి శిలాలోచన స్వాగతం చెప్పారు. ప్రఖ్యాత కవి శివారెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. అధ్యక్షులు మాట్లాడుతూ " 'ప్రవహించే జ్ఞాపకం' (1992) నుంచి 'సరిహద్దు రేఖ' ( 2002) ను దాటి సువిశాల జీవనావరణంలోకి ఈ కవితా సంపుటి 'ఎడతెగని ప్రయాణం' తో ప్రవేశించాడు యాకూబ్. వ్యక్తిగా, కవిగా, సృజనశీలిగా యకూబ్ పరిణామం ఈ మూడు పుస్తకాలద్వారా తెలుస్తుంది." అన్నారు.చిత్రంలో ఎడమ నుండి కుడి వైపు: శ్రీయుతులు కొండపల్లి ఉత్తం కుమార్, శిఖామణి, వరవరరావు, శివారెడ్డి , రమణ (నీలం చొక్క), యాకూబ్(ఎర్ర చొక్కా), వాడ్రేవు చినవీరభద్రుడు మరియు దర్భశయనం శ్రీనివాసాచార్య

ప్రఖ్యాత కవి వరవరరావు "ఎడతెగని ప్రయాణం " పుస్తకాన్ని ఆవిష్కరించి కృతిని, యకూబ్ జీవన యానంలో నేటి స్థితి, ప్రగతి కి తోడ్పడిన కొండపల్లి ఉత్తం కుమార్,అడ్వొకేట్,ఖమ్మం కు అందచేశారు. ఆవిష్కర్త " కవులు తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించాలి. మానవ సంబంధాలు, మానవీయ విలువల గురించి
యాకూబ్ తన కవితలలో వివరిస్తారు.యాకూబ్, క్యా ఖూబ్ ! మానవ సంబంధాలు తగ్గుతున్ననేటి సమాజంలో మనిషిని మనిషిగా ప్రేమించాలంటారు. మనిషి ప్రకృతిలో భాగం ఐతే, ప్రకృతిని ఒక వనరు (source) గా చూస్తున్నాము. చివరకు మనుషులను కూడా ఒక వనరు (Human resources) గా చూస్తున్నాము. కుప్పంలో చదివిన సూఫీ కవిత్వ ప్రభావం యాకూబ్ పై ఉంది. " అంటూ యాకూబ్ రాసిన కొన్ని కవితలను చదివి వినిపించారు.

కృతి స్వీకర్త కొండపల్లి ఉత్తం కుమార్ మాట్లాడుతూ " నాకు కవిత్వంలో పెద్ద ప్రవేశం లేదు. అయినా ఈ పుస్తకాన్ని ఇష్టంగా స్వీకరిస్తున్నా. యాకూబ్, వరవరరావు ల లో ఎల్ల వేళలా చెరగని చిరునవ్వు సామ్యంగా కనిపిస్తుంది." అన్నారు.

ప్రముఖ కవి వాడ్రేవు చినవీరభద్రుడు మాట్లాడుతూ " యాకూబ్ నాకు తెలియనప్పుడు ఈ పుస్తకం గురించి ఎక్కువ చెప్పగలనేమో! మా ఇద్దరి సాన్నిహిత్యం ఎక్కువ మాట్లాడకుండా చేస్తుంది.యాకూబ్ కవితలలోని నిజాయితి మనల్ని ఆకట్టుకుంటుంది. John Stuart Mill కవిత్వం అంటే ఏమిటి? అనే విషయం పై అంటారు "Oratory is heard. Poetry is overheard " అని. కవి సమయాలు తమ ఆలోచనలతో కాటేయటానికి సిద్ధమవుతుంటాయి. " అన్నారు. కన్నీరొక చుక్కున్నచో ... అనే కవిత చదివి వినిపించాక, యాకూబ్ ప్రయాణం ఎడతెగకుండా సాగాలని కోరుకుంటూ తమ ఉపన్యాసం ముగించారు.

ప్రముఖ కవి శిఖామణి మాట్లాడుతూ " ముందుగా యాకూబ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రపంచ సాహిత్యం నాలుగు ద్రవాలపై ఆధారపడి వుంది. అవి రక్తం, వీర్యం, స్వేదం ఇంకా బాష్పం (కన్నీరు). అనేక సామాజిక సంఘటనల చిత్రణే ఈ కవితలు. ఇవి కవితలు కావు జీవితం అంటూ కొన్ని కవితలు చదివి వినిపించారు.

పోలికలు

జొన్నచేలు మంచె కింద
తలలూపే కంకులు

పురేడు పిట్టలకోసం అల్లిన
వలలాంటి అరిసె

చేపల కోసం
వాగులో పన్నిన మావు

పదాలకోసం ఊహల్ని పన్ని
కవిసమయంతో పొంచివుండే
కవి

తరువాత ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య యాకూబ్ కవిత హృదయ దయాద్వయాలు లోంచి చిన్న భాగం వినిపించారు.
ఒక స్వప్నకాంత
విప్పిన రైకలోంచి పాలుతాపిద్దామని
ముడివిప్పి అతడిని పిలిచింది

యకూబ్ ఎడతెగని ప్రయాణం అంటే సుమతీ శతకంలోని
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్‌
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ.
అన్న పద్యం గుర్తొస్తుంది. ఏమీలేనితనం నుంచి ఆలోచనలోకి వెళ్లడటమే యాకూబ్ ప్రయాణం. నిరంతరం నిప్పుకణికలా జ్వలించే ఆత్మే ఈ కవితాత్మ. ఈ సంకలనం లోని మొదటి 76 కవితలు ఒక ఎత్తైతే 77 వ కవిత వాటికి సరి జోడు. మొదటి 76 కవితల వేదనకూ సమాధానం 77 కవిత విత్తనం కంటున్న కల లో దొరుకుతుంది. కొన్ని కవితల ప్రారంభాలు విషాధంగా ప్రారంభమయి విషాదంగానే ముగుస్తాయి. ఉదాహరణకు
పోలవరం
అమ్మా అని పిలుచుకునే
సొంత ఊరు, ఎందుకిలా జలం మింగేస్తుంది

మరో కవిత ప్రేమప్రసారం లోని చిన్న భాగాన్ని వినిపించారు
కలవంటి, శిలవంటి, కాంతివంటి,కరుణవంటి
సుడులుతిరిగే ఊహవంటి, ఉరకలెత్తే ఉద్వేగం వంటి
ప్రేమే కవిత్వం

కొన్ని కవితలు వ్యక్తం చేసినంత అవ్యక్తం కూడా చేస్తాయి అంటూ ముగించారు."అల్లుకున్న కష్టములలో, అమ్మ వోలె ఓదార్చను" పాట పాడిన గోరటి వెంకన్న

ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న " 1982 నుంచీ యాకూబ్ కవిత్వంతో పరిచయం ఉంది. బాల్యం, అమాయకత్వం అన్నీ ఉన్నై యాకూబ్ లో" అంటూ అల్లుకున్న కష్టములలో, అమ్మ వోలె ఓదార్చను పాట పాడి సభికులను ఆకట్టుకున్నారు.స్వీయ కవితను వినిపిస్తున్న సుజాత పట్వారిస్వీయ కవితను వినిపిస్తున్న రేణుకా అయోల

తదుపరి సుజాత పట్వారి, రేణుకా అయోల,జాన్ హైడ్ కనుమూరి మరియు రమణ వారి వారి కవితలు చదివి వినిపించారు.


శ్రీమతి లీల (Social welfare department) యాకూబ్ ని సన్మానించారు, శాలువా కప్పి

చివరగా కవి యాకూబ్ మాట్లాడుతూ తను ఇష్టం గా పాల్గొన్న ద్వారకా హోటల్ కవి సమ్మేళాలు, తను చదివిన నగ్నముని, అజంతా, శ్రీశ్రీ కవితల ను గుర్తుచేసుకొన్నారు. " శ్రమ పడటమే మెలుకువ అని మా నాయన చెప్తుండేవారు.సింగరేణి కాలరీస్ వారి కార్యాలయంలో ఒక చిన్న ఉద్యోగంతో నా ఉద్యోగపర్వం ప్రారంభించాను." అంటూ ప్రేమే కవిత్వం, కవిత్వమే ప్రేమ పాట పాడారు. తన స్కూలు, కాలేజ్, యూనివర్సిటీ సహాధ్యాయులను, తన మిత్రులను సభకు పరిచయం చేశారు. వారి సత్కారాల తదుపరి సభికుల కోరికపై శ్రీ శ్రీ కవిత "పతితులార! భ్రష్టులార! బాధాసర్ప దష్టులార !!! ఏడువకండేడువకండి .." ను పాడి సభను ఉత్తేజింప చేశారు. యాకూబ్ కవే కాదు చక్కటి పాటకాడు కూడా.

కవిత్వానికి ఆదరణలేదంటున్న వారు ఈ సభను చూసితీరాలి. హాలు నిండి, సీట్లు లేక కొంతమంది నిల్చున్నారు కూడా. డా||మిత్రా, నటుడు కాకరాల, కవి సుద్దాల అశోక్ తేజ, రచయిత్రులు మృణాళిని, అబ్బూరి ఛాయాదేవి, వోల్గా, కొండేపూడి నిర్మల,జ్వలిత, సి.వి.కృష్ణారావు(నెల నెలా వెన్నెల) ప్రభృతులు సభకు హాజరయినవారిలో వున్నారు.
ఏకాంతానికి భిన్నంగా, సమూహపు అనుభవానికి వుండే కాంతిమయ పరిమళం నిండిన యాకూబ్ కవితలకు ఇప్పుడు అంతర్జాలంలో ఒక ఇల్లుంది.
http://layasahityam.com/
లక్ష్మి (శిలాలోలిత) లోని ల, యాకూబ్ లోని య కలిపితే లయ. ఈ లయ పేరు పైనే కవి జాన్ హైడ్ కనుమూరి ఒక బ్లాగ్ సృష్టించారు యాకూబ్ అభిమానులకై .
http://layapoetry.blogspot.com/
ఈ web site, blog ల లో యాకూబ్ కవితలు, వ్యాసాలు, శిలాలోలిత రచనలు చూడవచ్చు.

Photos & Text:cbrao

8 వ్యాఖ్యలు:

అక్షర మోహనం చెప్పారు...

I have received invitation from Yakoob kavi. But
I could not attend. Thaks for your good information. please convey my congratulations to Yakoob. I wish every success in his 'YEDATEGANI PRAYAANAM'.

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

చాలా బాగుందండీ మీ పరిచయం వీడీయో కవరేజిలా.

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

u can see some more pics
http://johnhaidekanumuri.blogspot.com/2010/03/blog-post.html

కెక్యూబ్ వర్మ చెప్పారు...

ఈ చివరాఖరుననున్న నాకు కళ్ళముందు కట్టినట్లు చూపారు. సాహిత్య సభ విజయవంతమయినందుకు అభినందనలు. యాకూబ్ గారికి శుభాభినందనలు తెలియజేయగలరు.

ramperugu చెప్పారు...

మంచి దృశ్యమానమైన వివరాలు అందిచారు రావు గారు..
సభకి వచ్చిన ఫీలింగ్..! యాకూబ్ గార్కి శుభాకాంక్షలు..

SRRao చెప్పారు...

రావు గారూ !
యాకూబ్ గారి 'ఎడతెగని ప్రయాణం' ఆవిష్కరణను కళ్ళకు కట్టింది మీ నివేదిక. దన్యవాదాలు

dhaathri చెప్పారు...

fantastic sir........love j

BALASUDHAKARMOULI S చెప్పారు...

aanadam

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి