Left to Right: M/S Suri Babu (Creative Links Publications), V A K Ranga Rao, Ravi Kondala Rao, Prof Modali Nagabhushana Sarma, J.Madhusudhana Sarma and Dr. V.V.Rama Rao
ప్రొఫెసర్ మొదలి నాగభూషణ శర్మ రచించిన "తొలినాటి గ్రామఫోన్ గాయకులు" పుస్తకావిష్కరణ మార్చ్ 20, శనివారం , 2010 న హైదరాబాదు నగర కేంద్ర గ్రంధాలయం లో ప్రఖ్యాత సినీగీత విశ్లేషకుడు, విమర్శకుడు, గ్రామఫోన్ రికార్డుల సంగ్రాహకుడైన విఏకె రంగారావు చేశారు. సభకు అధ్యక్షత వహించిన నటుడు, విజయ చిత్రసంపాదకులు, రచయిత ఐన రావి కొండల రావు మాట్లాడుతూ "ఆనాటి వారి సంగీతం, ఈ నవతరానికి పరిచయం చేస్తున్న ఈ సభ అపూర్వమైనది. మా బాల్యంలో గ్రామఫోన్ మాకు కొత్త. మా స్కూల్ కు వెళ్ళే దారిలో, ఒకాయన గ్రామఫోన్ గొట్టం లో లవకుశ పాటలు వింటుంటే, అవి మాకు అబ్బురంగా తోచి, ఆసక్తిగా వినే వాళ్లం. 78 r.p.m. రికార్డులు తో మొదలయి, 45 , 33 1/3 r.p.m. ఆ పై CD లు గా అవి సాంకేతికంగా అభివృద్ధి చెందాయి. 1957 -58 ల లో సినీ ప్రభ లో రికార్డ్ రివ్యూ రంగారావు వ్రాసేవారు. పత్రిక చేతికి రాగానే ముందుగా రంగారావు సమీక్ష చదివేవాడిని. వీరి వద్ద పెద్ద రికార్డుల భాండాగారం ఉంది. ఈ సభకు విచ్చేసిన జె. మధు సూధన శర్మ మరో రికార్డ్ సంగ్రాహకులు. వీరు 50 సవత్సరాల నుంచి రికార్డుల సేకరణలోను, వాటిని భద్రపరచడంలోను, కేటలాగు చేయటంలోనూ నిమగ్నమై ఉన్నారు. పాత పాటలను digitize చేసి శ్రావ్యంగా వినిపిస్తారు. మనతోనే ఉన్న రమేష్ మరో రికార్డ్ సంగ్రాహకులు. ఆ కాలం సంగీతం గురించిన సభను ఏర్పాటు చేసిన ఈ కాలం క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ సూరి బాబు కు నా అభినందనలు." అన్నారు.
Left to right: J.Madhusudhana Sarma and Prof Modali Nagabhushana Sarma
తరువాత పుస్తక రచయిత ఆచార్య మొదలి నాగభూషణ శర్మ మాట్లాడుతూ తెలుగు సినిమా పై శ్రద్ధ, ఆసక్తి గల ప్రచురణ కర్త సూరి బాబు తో తమకు గల అనుబంధం గుర్తు తెచ్చుకొన్నారు." నాటకరంగంపై నాకున్న ఆసక్తి వలన పెక్కు నాటకాల రికార్డులు సేకరించాను. 1880 - 1940 మధ్య కాలంలో సుమారు 50 నాటక సమాజాలుండేవి.ధార్వాడ సమాజం వారు రాజమండ్రి వచ్చి నాటకాలాడేవారు.క్షత్రియ పార్వతీ బాయి శకుంతల పాత్ర నటించేది. ఈమె గురించిన పెక్కు ఆసక్తికరమైన సంగతులున్నాయి. 100 నాటక సమాజాల గురించి వ్రాయటానికి 8 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాను. అప్పటి నాటక సమాజాల గురించిన లిఖిత చరిత్ర లేకపోవటంతో విషయ సేకరణ కష్టమైన పనవుతోంది. ఈ రోజు ఆవిష్కరణవుతున్న పుస్తకంలో ఆ నాటి 20 మంది గాయకుల జీవన చిత్రణలున్నాయి" అన్నారు.
V A K Ranga Rao
తరువాత ప్రఖ్యాత సినీగీత విశ్లేషకుడు విఏకె రంగారావు తనదైన ఫక్కీలో శ్రోతలకు హుషారు కలిగించేలా మాట్లాడుతూ సంగీత ప్రపంచానికి సంబంధించిన తమ మనోగతాన్ని అవిష్కరించారు." శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి సాష్టాంగ నమస్కారాలు.నేను చాలా గొప్ప వాడిని. చప్పట్లు కొట్టండి. ఇతరుల గొప్పదనం గుర్తించి, నేను గొప్పవాడిని అయ్యాను. నన్ను సరాగమాల వాడిగా ప్రజలు గుర్తించారు. 48 భాషలు , వాటిలో 15 విదేశి భాషల పరిచయం ఇంకా 400 గొంతులను గుర్తు పట్టగలను. నాలా ఎవరైనా ఉన్నారా?
చితల్కర్ రామచంద్ర, సలీల్ చౌదరి ఇంకా నాగయ్య ప్రభృతులు నా అభిమాన సంగీత దర్శకులు. ఈ పుస్తకంలో ఇచ్చిన CD లోని అన్ని పాటలూ నా వద్ద ఉన్నాయి. యోగి వేమన వదినగా క్షత్రియ పార్వతీ బాయి నటించారు. వేమూరి గగ్గయ్య గారిని సినిమాలో చూశాను కాని రంగస్థలం పై చూడలేదు. అప్పటి నాటక కళాకారిణి క్షత్రియ వెంకటరమణమ్మకు మిత్రులతో విశాఖపట్నంలో సన్మానం చేయించాను. S.S.L.C పాసయ్యాను. ఇంటర్ తప్పాను. అయినా గ్రామఫోన్ రికార్డ్ లు వింటూ, వాటి గురించి తెలుసుకొంటూ ఎంతో జ్ఞాన సంపన్నుడ్నయ్యాను. రామదాసు కీర్తనను, త్యాగరాజు కీర్తనవలె ఎం.ఎస్.సుబ్బలక్ష్మి పాడారు. మేము చిక్కవరం జమీందారులం. మా అమ్మ గారు సరస్వతి దేవి తేలప్రోలు రాజాగారి మూడవ కూతురు.బాల్యం నుంచీ సానివారు పాడే పాటలంటే నాకు ఇష్టం. మా బొబ్బిలిలో వినోదానికి ఏవీ ఉండేవి కావు. నేను, నా ఇద్దరక్కలు గ్రామఫోన్ లో హిందీ, తెలుగు, తమిళ్ పాటలు రోజంతా తరచుగా వింటూ ఉండేవాళ్లం. మా చిన్న తనాన గడ్డిభుక్త సీతారాం (స్వస్థలం మాడుగుల) బాల్యంలోనే వచ్చి,వేణుగోపాలస్వామి ఆలయంలో సానిగాను, బొబ్బిలి రాజావారి ఆస్థానంలో రాజనర్తకిగాను ఉండేవారు.ఆవిడ దాదాపు ప్రతిరోజు ఉదయం పూట రాణీవారి వద్దకు వచ్చి సైరంధ్రీ (మహాభారతం - విరాటపర్వం లోని ద్రౌపది) చేసే పనులు చేసేవారు.మా అమ్మగారి పొడుగాటి జుట్టుకు నూనె పెట్టడానికి, తల స్నానం చేయించటానికి, ఆరబెట్టిన కురులకు సాంబ్రాణీ వేయటానికి కావలసిన మరో మనిషి సాయంలో ఈ సీతారం ఉండేవారు. ఇవి కాక రాణీ గారిని చూడటానికి వచ్చేవారికి కావల్సిన అతిధి మర్యాదలు చేసేవారు. ఆవిడ మా పిల్లలందరినీ దగ్గర కూర్చో పెట్టుకుని ' చేతిలో వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, కస్తూరి తిలకం ' లాంటి పాటలు నేర్పేది. పండగలప్పుడు దేవుణ్ణి ఊరేగింపు తీసుకెళ్లేవారు. ఆ వూరేగింపులో దేవదాసీలు నాట్యం చేసే వారు. ఆవిడ సానివాళ్లు చేసే నాట్యమే కాకుండా మద్రాసు వెళ్లి బెంగళూరు నాగరత్నం వద్ద తంజావూరు నాట్యం నేర్చుకుంది. తిరువీధిలో ఆడిన పాటలు సీతారాం ను పాడమని కోరేవాడిని.నృత్యం లో నా మొదటి గురువు ఆవిడే.
నేను నా సంగీత, నృత్యాలు సానివారి వద్దే నేర్చుకొన్నాను.(నేపధ్యం: ఆ కాలంలో సాంప్రదాయ కళలైన సంగీతం, నృత్యం దేవదాసీలే కాని గృహిణులు, పెళ్లి కాని వారు నేర్చుకునే వారు కాదు. ఇలా నృత్యాలు చేయటం, పాటలు పాడటం, నాటకాలలో పాత్రలు వేయటం అమర్యాదగా భావించే వారు. గౌరవనీయ కుటుంబాలలోని స్త్రీలు వీటి జోలికి పోయే వారు కాదు. నాటకాలలో స్త్రీ పాత్రలను మొగవారే స్త్రీ వేష ధారణలో పోషించే వారు. స్థానం నరసింహా రావు, పారుపల్లి సత్యనారాయణ, ఉప్పలూరి సంజీవరావు ప్రభృతులు స్త్రీ పాత్రలలో ప్రఖ్యాతి చెందారు. రుక్మిణీ దేవి అరండేల్ ఈ లలిత కళలను నేర్చుకొని, వాటిని నేర్పటానికి మద్రాస్ లో కళాక్షేత్ర స్థాపించి ఈ కళలకు గౌరవనీయ కుటుంబాలలో స్థానం కల్పించారు -cbrao). నృత్యం లో నా రెండవ గురువు కళావర్ రింగ్. (నేపధ్యం:అసలు పేరు సరిదె లక్ష్మీ నరసమ్మ. వీరు విజయనగరం లో దేవదాసీగా ఉంటూ మేజువాణి నృత్యాలు చేస్తూ, బీద విద్యార్థులకు సహాయపడేవారు. ఈమె సహాయం అందుకున్నవారిలో ప్రఖ్యాత గాయకుడు ఘంటశాల కూడా ఉన్నారు. ఆవిడ చిన్న పిల్లగా వుండేటపుడు విజయనగరంలో వుండే ఒక వైశ్య శిఖామణి, శృంగార పురుషుని చేతికి కళావర్ మార్కు రింగు వుండేది. ' నా కది కావాలి ' అని మారాం చేస్తే ఆ సంగతి ఆ వైశ్య శిఖామణి తెలుసుకొని ఆవిడను చేరదీశాడు. ఈవిడకు అప్పటినుండి ' కళావర్ రింగ్ ' అని పేరొచ్చింది. ఈవిడ డబ్బు, పేరు, ప్రతిష్ట సంపాదించింది ఆ పేరుతోనే. ' సరిదె లక్ష్మీ నరసమ్మ ' అంటే ఎవరికీ తెలియదు.మొదట మేజువాణీలలో చేసేది.తర్వాత రంగస్థలం పై కార్యక్రమాలిచ్చేది. ఈమె నాట్యకత్తే కాకుండా, హరికధలు కూడా చెప్పే వారు.ఆమె వ్రాసుకున్న పాటే 'రాతిరి నాటక మయినది మొదలుగా రాదు కదా నిదుర ' అన్నది. ఈమె పాడిన ఎనిమిది పాటలు 4 రికార్డులు గా వెలువడ్డాయి. వి.ఏ.కె రంగారావు గారి పుస్తకం ఆలాపనలో ఈమె గురించిన సమాచారం ఉంది. -cbrao). కళావర్ రింగ్ వద్దకు నన్ను ఉమ్మి రామకృష్ణయ్య తీసుకెళ్లి పరిచయం చేశారు.
నాగయ్య గారి త్యాగయ్య లో తమిళ కర్ణాటిక గాయకులను చొప్పల్లి సూర్యనారాయణ వ్యంగంగా అనుకరించి పాడారు. అప్పట్లో 100 రూపాయాలిచ్చారు దానికి.
ఆది తాళం సులువైనది.త్యాగరాజు కీర్తనలు దేశాది, మధ్యాది తాళాలలో ఉన్నాయి.
అలరులు గురియగ నాడెనదే, అలకల గులుకుల నలమేలుమంగ - కీర్తనను దేశాదిలో పాడాలి.
గ్రామఫోన్ రికార్డులు వినటం వలన సంగీతం పై ఆసక్తి, జ్ఞానం కలిగాయి.
మహాత్మా గాంధి కి ఇష్టమైన
वैष्णव जन तो तेने किहये, जे पीड परायी जाणे रे
पर दुख्खे उपकार करे तोये, मन अिभमान ना आणे रे
सकळ लोक मान सहुने वंदे, िनंदा न करे केनी रे
वाच काछ मन िनश्चळ राखे, धन धन जननी तेनी रे
వైష్ణవ జనతో తేనె కిహయె, జె పీడ్ పరాయీ జాణె రె ఏ భాషలో ఉందా తెలుసా? నరసింహ్ మెహ్త ఈ ప్రార్థనా గీతాన్ని గుజరాతీ లో వ్రాశారు.
Tino Rossi పాడిన Santa Lucia - 78 rpm అనే పాట నా బాల్యంలో విన్నాను. ఇటలీ దక్షిణ భాగాన ఉండే నాప్పొలి (Naples) ప్రాంతం వారు మాట్లాడే నియోపొలిటన్ భాషలో ఈ పాట ఉంది. ప్రేమ గీతాలకు 500 సంవత్సరాల వయసు కల ఈ భాషను వాడుతున్నారు.
ఈ పుస్తకం తో ఇచ్చిన CD లో ఉన్న "మీరజాల గలడా నా యానతి" వ్రాసినది స్థానం నరసింహారావు. వారే రంగస్థలం పై ఈ పాటను అభినయించే వారు. తెనాలి లోని రామవిలాస సభ లో ఉంటూ నాటకాలాడేవారు. యమ సావిత్రీ సంవాదం, కృష్ణలీలలు వగైరా నాటకాల రికార్డులు సుమారు 60 నా సేకరణలో ఉన్నాయి. నా వద్ద ఉన్న రికార్డ్ లు అన్నీ ప్రచురించాలంటే కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ద్వందార్ధాలతో కూడిన మాటలతో తొలినాళ్లలో రికార్డ్ లు వచ్చేవి. పట్టునో,పట్టదో,పెట్టి చూడలనే లాంటి రెండర్ధాల మాటలతో K.V. రమణమ్మ ప్రభృతుల రికార్డు లు వచ్చేవి. గ్రామఫోన్ కంపనీ వారు అడిగి ఇలాంటి సంభాషణలు వ్రాయించుకునేవారు. ముంబాయి చిత్రం లో ఎ.ఆర్.రెహ్మాన్ అరేబియ సంగీతం తొలిసారి ఉపయోగించాడన్న కొందరు విమర్శకుల అభిప్రాయం సరికాదన్నారు. బాలాంత్రపు రజనీకాంత రావు సంగీత దర్శకత్వంలో, గృహప్రవేశం చిత్రం లో భానుమతి పాడిన కనవొహో కనవొహో అనే పాటలో తొలిసారిగా అరబిక్ సంగీతం వాడటంజరిగింది. అలాగే తెలుగు సంగీతంలో పాశ్చాత్య పోకడలు పోయినది ఎస్. రాజేశ్వర రావు అని, ఇల్లాలు చిత్రంలో ఎస్.వరలక్ష్మి పాడిన " కోయిలొకసారి వచ్చి " (ఈ లింక్ పని చేయనియెడల http://www.oldtelugusongs.com లో ఈ పాట కోసమై అన్వేషించగలరు) పాటలో ఈ విషయం గమనించవచ్చు" అంటూ తమ ప్రసంగాన్ని ముగించారు.
ప్రసంగం తర్వాత, విశిష్ట అతిధులను దుశ్శాలువాలతో సన్మానించారు. ఆ తదుపరి గ్రాంఫోన్ రికార్డు లు తయారు చేసే విధానం, తొలినాటి గాయకుల పాటల పై ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. భారత గ్రామఫోన్ రికార్డు ల మొదటి 100 సంవత్సరాల లో ఎన్నో విశేషాలు చోటుచేసుకున్నాయి. వాటి వివరాలకై ఇక్కడ చూడండి. భారతదేశం లో తొలి గ్రామఫోన్ రికార్డ్ 1906 లో విడుదలయ్యింది. ఆ పాట వినండి ఈ కింది వీడియోలో.
సభ అనంతరం రంగారావుగారు తొలినాటి గ్రామఫోన్ గాయకులు పుస్తక ప్రతులపై , పాఠకుల అభ్యర్ధన మేరకు తమ సంతకాలు (ఆటొగ్రాఫ్) చేసి ఇచ్చారు. వారి ప్రశ్నలకు బదులిచ్చారు.
కార్యక్రమ నిర్వహణలో లాహిరి లాహిరి లాహిరిలో, జీవితమే సఫలము పుస్తకాల రచయిత డా|| వి.వి.రామారావు తమ సహకారాన్నందించారు.
ఇంతకీ ఈ తొలినాటి గ్రాంఫోన్ సంగీతం లో ఏముంది?
ఈ పుస్తకం లో కపిలవాయి రామనాధ శాస్త్రి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, వేమూరు గగ్గయ్య, పసుపులేటి కన్నాంబ, చిత్తూరు నాగయ్య, స్థానం నరసింహా రావు,ఎస్.రాజేశ్వరరావు, టంగుటూరు సూర్యకుమారి ప్రభృతుల జీవన చిత్రణలు, వారు పాడిన పాటలు CD లోనూ ఉన్నాయి. ఇందులో ఘంటశాల మాస్టారుకు సహాయంచేసిన విజయనగరం గాయకి, నర్తకి ఐన కళావర్ రింగ్ పరిచయం లేక పోవటం వెలితిగా తోస్తుంది. ఐతే చేసిన పరిచయాలు తృప్తికరంగా ఉన్నాయి. CD లో తొలినాటి గాయకుల ప్రసిద్ధ గీతాలకు బదులుగా, అంతగా ప్రశస్తం పొందని గీతాలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు రికార్డ్ స్థాయిలో అమ్ముడు పోయిన "సర్వేశ్వరుండయిన" అనే కపిలవాయి రామనాధ శాస్త్రి పాట CD లో లేదు. మలిముద్రణలో ఈ లోపాలు సరిదిద్దగలరని ఆశిద్దాము. ఆనాటి రంగస్థల కళాకారుల గురించి, ఈనాటి యువతరం తెలుసు కోవటానికి, అప్పటి గ్రామఫోన్ రికార్డ్ లు పై ఆసక్తి పెంచటానికి ఈ పుస్తకం దోహదపడకలదు.
వేమురి గగ్గయ్య గారి కొన్ని పద్యాలు వినండి
|
కుప్పించి ఎగసిన
కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి
గగన భాగంబెల్ల కప్పికొనగ
ఉరికిన నోర్వక ఉదరంబునందున్న
జగముల వ్రేగున జగతి కదల
చక్రంబు చేబట్టి చనుదెంచు రయమున
పైనున్న పచ్చని పటము దిగువ
నమ్మితి నా లావు నగుబాటు సేయకు
మన్నింపుమని క్రీడి మరల దిగువ
కరికి లంఘించు హరిణంబు కరణి మెరసి
నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు
విడువుమర్జునా యనుచు మద్విశిఖ వృష్టి
తెరలి చనుదెంచు దేవుడే దిక్కు నాకు
కృతజ్ఞతలు: ఈ పుస్తకావిష్కరణ గురించిన సమాచారమిచ్చిన మిత్రులు పరుచూరి శ్రీనివాస్, ఈ వ్యాస రచనకు తోడ్పడిన వి.ఏ.కె రంగారావు పుస్తకం 'ఆలాపన' ఇచ్చిన కొలిచాల సురేష్ ల కు నెనర్లు.
Photos & text: cbrao
6 కామెంట్‌లు:
గగ్గయ్య గారి పద్యాలు బాగున్నాయండి.
మీ వ్యాసం అద్భుతం ! ముఖ్యంగా వేమూరి గగ్గయ్య పాడిన పద్యాలు బాగున్నాయి. అభినందనలు.
It's a detailed presentation on a good programme. Thank you. You cannot find such depth and detail in news paper reports. You have done good research before posting this and have acknowledged the people who helped you.
ఈ విలువైన పుస్తకం గురించి ఇక్కడ పరిచయం చేసినందుకు గాను నెనర్లు. చాల విలువైన సమాచారం. రంగారావు గారు చెప్పిన విదంగా ఎవరైనా ముందుకు వచ్చి ఆ కోటి రూపాయలు సహాయం అందిస్తే ఆయన దగ్గర ఉన్న విలువైన రికార్డ్స్ అన్నిటిని కాపాడుకోవచ్చు, ఆసక్తి ఉన్న తరువాత తరాల వారికి అందించవచ్చు. :(
Some of the old songs are available at:
http://www.surasa.net/music/toli-telugu/
ippude meetho matladanu.
paatalu padyalu vinna tharuvaatha malli chuustanu.
aswinikumar.v
కామెంట్‌ను పోస్ట్ చేయండి