బుధవారం, మార్చి 10, 2010

పాత్రికేయులకు పాఠాలు



Kashyap welcoming guests

2010, మార్చి 7, ఆదివారం నాడు కంప్యూటర్ లో తెలుగు వాడకం పై పాత్రికేయులకు ఒక అవగాహనా సదస్సును e- తెలుగు వారు నిర్వహించారు. తొలుత కార్యదర్శి కశ్యప్ e- తెలుగు సంస్థ చరిత్ర, ఆశయాల గురించి చెప్పారు. యునికోడ్ పుట్టుపూర్వోత్తాలు, దాని ఆవశ్యకత, ఉపయోగాలు గురించి సంస్థ అధ్యక్షులు వీవెన్ వివరించారు. తెలుగు వికీపిడియా ఆవిర్భావం, ఎదుగుదల ఇంకా అందులోని విషయాల గురించి e- తెలుగు పూర్వ అధ్యక్షులు శిరీష్ కుమార్ మాట్లాడారు. ఈ సదస్సులో తెలుగు తరంగాలు అనే తెలుగు బ్లాగును, e -తెలుగు కోశాధికారి చక్రవర్తి ఆధ్వర్యంలో, పాత్రికేయుడు M.నాగేందర్ ప్రారంభించారు.

పాత్రికేయులకు సాంకేతిక విషయాలు తెలుసుకోవటంలో ఆసక్తి లేదో లేక సదస్సు జరిగిన దిల్‌షుక్ నగర్ సమావేశ స్థలి పత్రికా కార్యాలయాలకు దూరంగా వుండటం వలనో 12 మంది పాత్రికేయులు మాత్రమే సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సు ముఖ్యొద్దేశమైన కంప్యూటర్స్ లో తెలుగు వాడటానికి కావల్సిన అవగాహన లో Hands on computer session విద్యుచ్ఛక్తి అంతరాయంతో జరుగలేదు. పాత్రికేయుల సందేహాలు తీర్చే ' ప్రశ్నలు జవాబులు ', ఆహ్వాన పత్రికలో ఉన్న మరికొన్ని అంశాలు సమయాభావంతో నిర్వహించబడలేదు. పాత్రికేయులకు, రచయితలకు ఈ స్థాయిలో తలపెట్టిన సమావేశాలలో తొలిదయిన ఈ సమావేశ నిర్వహణలో లోపాలు కనిపించాయి. ఇలాంటి పాఠ్యాంశాలు అన్యూన్యచర్యా పేతంగా (Interactive) గా వుంటే ఎక్కువ ప్రయోజనకరంగా వుండగలవు. అయితే తదుపరి సమావేశాలలో సరైన సమయ పాలనతో ఈ చిక్కులను అధికమించవచ్చు.

ఈ సదస్సు కొన్ని సత్సంకేతాలను ఇచ్చింది. ప్రస్తుత పత్రికా కార్యాలయాలయలలో కంప్యూటర్ల పై నున్న నిర్లిప్తత నుంచి వాటిని క్రియాశీలకంగా వాడటానికి కావలసిన ఉత్సాహాన్ని పాత్రికేయులకు ఇచ్చింది. కంప్యూటర్లో తెలుగు వాడకం పై సందేహాలకు ఎలా చెయ్యలో, ఎవరిని అడగవచ్చో లాంటి ప్రాధమిక అంశాలు వెలుగులో కొచ్చాయి. దీనికి చాలా ప్రాముఖ్యత వుంది . ఎవరైనా ఎదైనా వ్యాసాన్నో, ఆహ్వాన పత్రికనో పత్రికా కార్యాలయానికి e-mail చేస్తే, ఫోన్ చేసి చెప్తే తప్ప ఇ-మైల్ చూసుకొరు. చూసినా, తదుపరి అభ్యర్ధన -బాస్ సందేశం మొత్తం ఫాక్స్ పంపకూడదా అంటూ. ఇలాంటి పరిస్థితులలో పాత్రికేయులకు ఇలాంటి అవగాహనా సదస్సుల అవసరం ఎంతైనా వుంది. పాత తరం పాత్రికేయుల కంప్యూటర్ ఫోబియా ను ఈ సదస్సులు తొలగించగలవు.


మరో ఆశాజనకమైన విషయమేమంటే, ఈ సదస్సు లో పాల్గొన్న పాత్రికేయులలో కొందరు తెలుగు బ్లాగరులున్నారు. వారు

1) కోవెల సంతోష్ కుమార్ -ఆనందిని - http://kovela.blogspot.com/

2) సిహెచ్. వేణు - వేణువు - http://venuvu.blogspot.com/

3) ఎస్.రాము ....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు.... http://apmediakaburlu.blogspot.com



Senior journalist S. Ramu addressing the gathering

సదస్సులో సీనియర్ పాత్రికేయులు ఎస్.రాము పాత్రికేయులనుద్దేశించి మాట్లాడుతూ " విజయవాడలో కొందరు నేరస్తులు పిల్లలను స్వలింగ సంపర్కం చేసి పట్టుబడినప్పుడు కొందరు రిపోర్టర్లు పిల్లల నోటిలో మైక్ పెట్టి వీళ్లు మిమ్ములను ఏమి చేశారో చెప్పండని గుచ్చి గుచ్చడిగినప్పుడు, పాత్రికేయుల నైజం పై రోత కలిగి అట్లాంటి వాటిని ఖండించటానికి నాకు ఒక బ్లాగు కావాలన్న నిర్ణయానికొచ్చా. e తెలుగు సమావేశాలు 2006 మార్చ్ 12న తొలిగా జరిగాయి. పాత్రికేయ ప్రపంచం లో ఈ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. Reporters sans frontiersఅనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 12 న నిర్వహించే దినాన్ని Cyber world day against cyber censorship గా పరిగణిస్తారు. అయితే ఈ సెన్సార్షిప్ ఎవరో బయటవాళ్లు చేసే అవసరం కల్పించకుండా , ఎవరికివారే బాధ్యతాయుతంగా వార్తలు ప్రసారం చేస్తే పాత్రికేయుల గౌరవం ఇనుమడిస్తుంది. బ్లాగు వ్రాసే అభ్యాసంలో పాత్రికేయుల తెలుగు భాషా పటిమ పెరుగగలదు.ప్రస్తుతం కార్యాలయాలలో బ్లాగులు చూడగలిగినా వ్యాఖ్య వ్రాసే సౌలభ్యం లేని కట్టడులున్నాయి. మీకు అసంతృప్తి కలిగించిన విషయాలే కాకుండా, మీ సృజనాత్మకతను వ్యక్త పరచే రచనలు మీ బ్లాగులలో చెయ్యవచ్చు. మీ రచనలలో నైతిక విలువలు పాటించండి. తెలంగాణా వాదులను తెలబాన్లు గా చిత్రిస్తూ కొత్త ఉద్వేగాలకు తెరతీయవద్దు. మనం ప్రసారం/ప్రచురణ చేసే విషయంలో ఎవరి గురించైతే వ్రాస్తున్నామో , వారి తరఫు వాదం కూడా మన ప్రసారం/ప్రచురణలో ఉండటం అభిలషణీయం." అన్నారు. చివరగా e తెలుగు వారు ఉత్తమ తెలుగు బ్లాగులకు ప్రోత్సాహిక బహుమతులందివ్వాలన్నారు.

కవి జాన్ హైడ్ కనుమూరి సమయాన్ని సద్వినియోగం చెయ్యటానికై, కంప్యూటర్ నేర్చుకునే సమయంలో వారి అనుభవాలు చెప్పారు. తనవంతుగా పెక్కుమంది కవులకు తాను బ్లాగు సృజించానన్నారు.

e - తెలుగు ఆశయసిద్ధిలో ఈ పాత్రికేయుల అవగాహనా సదస్సు మరో ముందడుగు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి