ఆదివారం, ఆగస్టు 31, 2008

జ్ఞాపకాలు, ఆలోచనలు,విశేషాలు -6

why_write

ఎందుకు రాయాలి?


ప్రతి రచయితా ముందు ఇదమిద్ధంగా, జవాబు తేల్చుకోవాల్సిన ప్రధమ ప్రశ్న ఇది. ఎవరి కోసం? ఎప్పుడు? ఇవి తరువాతి ప్రశ్నలు. ఎదైనా కొత్త విషయం తనకు తెలిసినది, ప్రపంచానికి చెప్పాలన్న దుగ్ధే, రచయితను ముందుకు నడుపుతుంది. తను ఎవరి కోసం రాస్తున్నాడో కూడా, రచయిత నిర్ధారించు కోవాలి. తను ప్రవేశ పెట్టే కొత్త ఊహలు, సిద్ధాంతాలు అందరికీ నచ్చక పోవచ్చనే స్ప్రుహలో రచయిత ఉండాలి. ఉదాహరణకు రచయిత హేతువాదయితే, తన రచనలు సమాజం లోని అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచజాలవనే వాస్తవాన్ని, గ్రహించాల్సుంటుంది. ఎక్కడ, ఎవరి కోసం రాస్తున్నామనే అవగాహనతో రాయాలి. కొన్ని సార్లు Target readers స్థాయి బట్టి రచనలు చేయాల్సుంటుంది. స్కూల్ పిల్లలకు శాస్త్రీయ విషయాలు రాసే సమయంలో, పిల్లల స్థాయిలో, మన భాష, శైలి వారికి సరళంగా బోధపడే విధంగా మన రచన ఉండాలి. సాధారణ పఠితలు (శోధకులు, నిష్ణాతులు కానివారు) విషయం లో రచనలు ఏ స్థాయి లో ఉండాలి అని మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పాఠకుడి స్థాయికి, రచయిత దిగి రాయాలా లేక రచయిత తన స్థాయిలో రచన చేసి, పాఠకుడిని అట్లాంటి కథలు చదివే స్థాయికి పెంచాలా అనేది అప్పుడప్పుడూ వినిపించే ప్రశ్న. పాఠకుడు తన స్థాయికి మించిన రచనలు చదివేలా అలవాటు చెయ్యటం, రచయిత ముందున్న సవాలు. రచయిత, తన రచన స్థాయిని అంచెలంచెలుగా పెంచుకుంటూ, పాఠకుడిని తన వెంటే తీసుకు వెళ్లాలి, తన స్థాయిలో. రచయితకు కొన్ని సార్లు, ఇది కత్తి మీద సామే అవ్వగలదు. ఈ ప్రక్రియ లో విజయం సాధించిననాడే, రచయిత పలువురి మన్నలను పొందగలుగుతాడు; కీర్తి శిఖరాలను ఆరోహిస్తాడు.

http://mandahaasam.blogspot.com/2008/08/blog-post_04.html

 

ప్రశ్నే జగత్కల్యాణానికి కారణభూతం

"చదివినదాన్ని ఊహించి ఆనందించడం నా చుట్టూ చాలా మంది చేస్తే, నేను కాస్త తింగరోణ్ణికాబట్టి ఆనందించడంతోపాటూ ప్రశ్నించడం మొదలెట్టేవాడిని." -పర్ణశాల మహేష్

ప్రశ్న, మానవుడి మేధ ఎందుకు, ఎలా, ఎప్పుడు అన్న ప్రశ్నలు వేసియుండకపోతే, ఈనాడు మనము ఈ ఉత్తరాన్ని e-mail లో కాకుండా, పావురాల ద్వారా పంపివుండేవారము. చెట్టుపై నుంచి కింద పడే ఆపిల్ పండు, కిందకు కాకుండా, పైకెందుకు వెళ్లటం లేదన్న ప్రశ్న, భూమ్యాకర్షణ సిద్ధాంతం కనుగొనటానికి కారణమయ్యింది. పక్షులు ఎగరగలుగుతున్నాయి. మనమేల ఎగురరాదు అనే ప్రశ్న రైట్ సోదరులకు వచ్చి ఉండక పోతే, అమెరికాకు మనము ఓడలలోనే ప్రయాణం చేసే వారము. ప్రశ్న మానవాళి ఆలోచన, జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసిన మహత్తరమైన వజ్రాయుధం.

చెట్టు ముందా, విత్తు ముందా

ఈ చరాచర ప్రపంచ సృష్టికర్త భగవంతుడని చర్చి,బైబుల్, వేదాంతాలు చెప్తాయి. దేవుడున్నాడని ఆస్తికులు బల్లగుద్ది చెప్తారు. ఇది విశ్వాసం పై ఆధారపడి ఉంది. సైన్స్ ఈ ఆలొచనా విధానానికి భిన్నంగా, పలు ప్రశ్నలు వేస్తూ, తనే సమాధానాలు కనుక్కుంటూ, ఈ నిరంతర పరిశోధనలో తనను తాను సవరించుకుంటూ, ముందుకు నడుస్తుంది. తను విశ్వసించినవాటికి ఋజువులు చూపిస్తుంది. నాస్తికులు సైన్స్ ను నమ్ముతారు. దేవుడు లేడని ప్రచారం చెయ్యరు. ఆస్తికులు ఉటంకించే దేవుడి అస్తిత్వానికి, తమ శాస్త్రీయ దృక్పధంతో, దానికి ఋజువు చూపమంటారు. శాస్త్రరీత్యా దేవుని అస్తిత్వాన్ని ఋజువు చేయటం సంభవం కాలేదు కనుక, నాస్తికులు దేవుని అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారు.

రచయిత బలహీనమే బలం

రచయిత సున్నిత మనస్కుడు. ఒక మానసిక బలహీనత ఉంటుంది. ఆ ఋగ్మత లో,తనకు తెలిసిన విషయాలు ప్రపంచానికి తెలియ చెప్పాలన్న దుగ్ధ (urge) ఉంటుంది. ఈ దుగ్ధే అతని చేత మహత్తరమైన రచనలు చేయటానికి ఉత్తేజాన్నిస్తుంది. ఇందుకు ఉదాహరణగా కార్ల్ మార్క్స్ 'Das Capital', గోర్కీ అమ్మ వగైరా చెప్పుకోవచ్చు. నిజానికి రచయిత మానసిక ఋగ్మతే అతని బలం. ఒక విషయం పై ఆలొచిస్తూ ఉన్నప్పుడు, ఆలోచనలు, కొత్త ఊహలు జీవన ధారలా వస్తాయి. వాటిని ఆపటం కష్టం. వాటిని ఎంత త్వరగా కాగితం పైన పెడితే, అంత బలోపేతంగా ఉంటాయి. ఆలొచనలను వికసించ నీయండి. వెయ్యి భావాలు వెలుగులోకి రానీయ్యండి.

విమర్శలు బ్లాగుకు అందం, జీవం
బ్లాగుకు విమర్శలు ఉప్పు లాంటివి. ఉప్పు లేని కూర ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. విమర్శలూ జిందాబాద్. బ్లాగరూ జిందాబాద్.

http://parnashaala.blogspot.com/2008/08/blog-post_24.html

7 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

పాఠకుడి స్థాయికి దిగి రాయాలా, లేక తన స్థాయిలో రాసి పాఠకుడిని ఎదిగేలా చేయాలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ విషయంలో తెలుగు బ్లాగుల పాఠకులు ముందంజలో ఉన్నాయి. ఒక్కోసారి పాఠకుడి స్థాయికి 'ఎదిగి ' రాయవలసిన అవసరం ఏర్పడుతుంది.అది నిజంగా కత్తి మీద సామే! బాగా చెప్పారు.

మాలతి చెప్పారు...

చర్చ మంచి చర్చే. కాని పాఠకుల స్థాయికి ఎక్కడం, దిగడం ప్రశ్న ఎవరికోసం రాస్తున్నారు అన్నదానిలో వుంది కదా. సాధారణంగా పాఠకుల గ్రూపులు చాలానే వుంటాయి. రచయిత ఎవరికోసం రాస్తున్నాడో ఆస్థాయిలోనే రాయడం జరుగుతుంది. ఎటొచ్చీ అందర్ని మెప్పించాలని తాపత్రయపడే రచయితలకే మీరన్న బాధ అనుకుంటాను,

మాలతి

cbrao చెప్పారు...

"రచయిత ఎవరికోసం రాస్తున్నాడో ఆస్థాయిలోనే రాయడం జరుగుతుంది. " ఇలా జరిగితే బాగే. కాని రచయిత పాఠకుడి స్థాయికి దిగివచ్చి రచన చెయ్యాలంటే ఎలా? కొంతకాలం క్రితం మనలోని మాట.. నా మనసులోని మాట అనే బ్లాగులో ఈ విషయం పై చర్చ వచ్చింది. కొత్తపాళి కథ పై జరిగిన ఆ చర్చను దృష్టిలో ఉంచుకుని పైన వ్యాసం లో అలా రాయటం జరిగింది. ఈ చర్చ లింక్ ఆ బ్లాగులో నాకు దొరక లేదు. లింక్ తెలిసినవారు పంపగలరు.

Rajendra Devarapalli చెప్పారు...

వెయ్యిమంది మహారచయితలకన్నా ఒక్కపాఠకుడు గొప్ప.అసలు మంచి పాఠకుడు కాని వాడు/రు గొప్పరచయితలు ఎలా కాగలరు?అతన్ని నేలమీద నిలబెట్టి మబ్బుల్లో నుంచి సందేశపు తుంపరలు రాలుస్తారా రచయితలు?ఇటీవలి కాలంలొ నాకు తెలిసిన ఒక గొప్పపాఠకుడు,మిసిమి వ్యవస్థాపకులు దివంగత ఆలపాటి రవీంద్రనాధ్.

Kathi Mahesh Kumar చెప్పారు...

ఈ చర్చ "చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం. తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం" అనే తెలుగు సినిమా నానుడిలా వుంది.రచయితలు కనీసం మొదటిసారి తను రాయాలనుకున్నది రాస్తారు. ఆ తరువాత పబ్లిషర్ కోసమో పాఠకులకోసమో రాస్తారు. అప్పుడొస్తుంది సమస్య. "అసలు పాఠకులు ఎవరూ?" "అసలు ఎలా,ఎవరికోసం రాయాలి?" అని.అప్పుడు ఆ రచయితలు కమర్షియల్ రచయితైకూర్చుంటారు. ఆ తరువాత ఇతరుల అవసరాలకి అనుగుణంగా రాయటమేగానీ తను రాయాలనుకున్నది రాయరు.కనీసం బ్లాగుల్లో ఈ సమస్యలు తక్కువే !

ఇక పాఠకుల స్థాయికి ‘దిగటాలూ’ ‘ఎక్కడాలు’ వుండవు. పాఠకుడే రచయిత రాసినదాన్నిబట్టి తన స్థాయిని నిర్దేశిస్తాడు.

విహారి(KBL) చెప్పారు...

మీకు వినాయక చవితి శుభాకాంక్షలు

ఉమాశంకర్ చెప్పారు...

మీకు తెలిసిన, లేక మీరు బాగా అభిమానించే రచయిత రాసిన ఒక రచన ని తీసుకోండి. ఇప్పుడు ఆలోచించండి ఆ రచన స్థాయి కి మీరు ఎదిగారా లేక మీకోసం (లేదా మీ లాంటి వాళ్ళ కోసం) ఆ రచయిత తన స్థాయిని దిగి రాసి నట్టు అనిపించిందా? రచన గొప్ప గా ఉంటే పాఠకుడే ఆ రచయిత స్థాయి నందుకుంటాడు. లేకుంటే ఆ పుస్తకాన్ని పక్కన పడెస్తాడు. అంత మాత్రాన ఆ రచయిత రచయిత కాకుండా పోదు.
డబ్బు కోసం "మాత్రమే" రాసే వారికి ఇది వర్తించదు.

/ఉమా శంకర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి