బుధవారం, జనవరి 19, 2011

అవి-ఇవి-అన్నీ -1

అవి -ఇవి-అన్నీ: ఇందులో ఏమి ఉంటాయి అంటే ఏమి ఉండవు అని జవాబు. అవునండి -భవదీయుడు చదివిన పుస్తకం, చూసిన సినిమా, నాటకం, చిత్రపటాలు, వార్తలు, విశేషాలు,  యాత్రా స్మృతులు, అనుభూతులు, అనుభవాలు  ఇంకా  అనేక జ్ఞాపకాల దొంతరలు ఇందులో చోటు చేసుకుంటాయి. అవధి ప్రకారం  వ్యాసం అని కాకుండా, నాకు వీలు కుదిరినప్పుడల్లా ఈ కబుర్లు దొర్లగలవు.

అఫ్సర్ నాన్నగారు  గురించి

"“అనుభవమే చివరి వెలుగు. ఈ క్షణమే చివరి క్షణం. ఆ వొక్క క్షణమూ సదామణి సదృశ జ్వాలగా వెలుగు” -ఒక బతకలేని బడి పంతులు, రచయిత, ఉపాధ్యాయుడు, కవి అఫ్సర్   తండ్రి ఐన  షంషుద్దీన్, రచయిత   కౌముదిగా మారిన తీరు గురించిన అఫ్సర్ వ్యాసం "నాన్నగారు...మళ్ళీ వస్తారా?"  మీరు చదివారా?    దారిద్ర్యం నుంచి  ఆస్టిన్ దాకా అఫ్సర్ జీవిత పయనం ఆశ్చర్యం కలిగించక మానదు.

ప్రియ అయ్యంగార్ అకాల మరణం

ప్రసాదం కోసం ఒక గంట ఉపవాసం చేస్తూ, నాన్న గురించిన కబుర్లు చెప్పే ప్రియ ఇక లేదు అంటే  నమ్మటం కష్టం.  అక్కకు వివాహమయి, దూరంగా వెళ్తుందనే బాధ ఎంత ఉన్నా  ఏడుపు నిభాయించుకుని  (ప్రియ మాటలలో తనకు "ఏడుపంటే యాక్" ), "అసలు చిరునవ్వుచూస్తే శత్రువైనా కరిగిపోడా"  అంటూ  అల్లరి చేసే ప్రియ మనకిక లేదు అనుకుంటే బాధ కలగదా!  "అసలు మనం నవ్వుతూ ఏ పనిచేసినా అది ఎప్పుడూ విజయమే కదూ." అనే ప్రియకు నివాళిగా ఏమివ్వగలం?  నవ్వుతూ కన్నీటి వీడ్కోలు తప్ప. ఇది తొలి తెలుగు బ్లాగరు మరణం.  

టివి ధారా వాహికలు

ఈ సోమవారం ( జనవరి 17, 2011) నుంచి, మా టివి లో  మా పసల పూడి కధలు ధారావాహిక మొదలయ్యింది.అంజనా సౌమ్య, వంశీల పాటతో మొదలయ్యే టైటిల్స్, బాపు రంగుల బొమ్మలతో,  గ్రామీణ వాతావరణంలో కన్నుల పండుగ గా    ఉన్నాయి. నిర్మాణం, దర్శకత్వం శంకు. ఈ పల్లె కధలు చూస్తుంటే  చాలా కాలం క్రితం దూరదర్శన్ లో ప్రసారమైన అమరావతి కధలు, మాల్గుడి  రోజులు  గుర్తుకొచ్చాయి.   గ్రామీణ నేపధ్యమే వీటన్నింటికీ మూలం.  ఆసక్తికరంగా మా పసలపూడి కధలను చిత్రీకరించారు. ఈ ధారావాహిక మొదటి భాగాన్ని ఇక్కడ చూడండి.
మా టివి లోనే సాయంత్రం 7 గంటలకు మరో కొత్త ధారావాహిక చిన్నారి పెళ్లికూతురు మొదలయ్యింది.ఉత్తర హిందుస్తానం లో ప్రాచుర్యమైన  ఈ ధారావాహిక లో  బాల్య వివాహం కధాంశం గా ఉంది. రాజస్థాన్ ప్రజల రంగుల దుస్తులు, అక్కడి హవేలి ల తో దృశ్యాలు  కంటికింపుగా ఉన్నాయి.  చిన్నారి ఆనంది కు జగదీష్ తో పెళ్ళి, ఆగిన స్కూల్ విద్య, ఆ పై అత్తవారింటికి పయనం.  నవ వధువుగా, భార్యగా, తల్లిగా ఆమె జీవితం లోని బరువు బాధ్యతలను చిన్నతనంలోనే మొయ్యవలసివస్తుంది. బాల్య వివాహాలు చట్టరీత్యా సమ్మతం కానప్పటికీ రాజస్థాన్ లో ఇవి మాములే. బాల్య వివాహాల వలన కలిగే కష్ట నష్టాలను ఈ ధారావాహిక చక్కగా చెప్పగలిగి, విజయవంతమైంది.జెమిని లో మరో కొత్త ధారావాహిక అడగక ఇచ్చిన మనసు ప్రారంభమయ్యింది.  భైరవమూర్తి  హైదరాబాదులో ఒక ఖరీదైన గేటెడ్ కమ్మ్యునిటీ లో ఉంటూ  దాని సెక్రెటరిగా అందరి పైనా పెత్తనం చెయ్యాలనే తలంపులో ఉంటాడు. భైరవమూర్తి  కొడుకు ప్రసాద్ బెంగలూరు వెళ్లి అక్కడ ఒక పేరు తెలియని (మధుమిత) అమ్మాయిని చూసి పడ్తాడు ప్రేమలో. కధంతా సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఉద్యోగపర్వం లోని ఆఫీస్ వెతలు, ప్రేమలు, అమెరికా వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు తో కూడి  యూత్ ను ఆకర్షించేలా ఉంటుందీ కధ. మధుమిత ఆఫీస్ లో  భార్యా భర్తలైన  సాఫ్త్వేర్ ఉద్యోగులను అమెరికా పంపే పధకం రాబోతుండటం తో పెళ్లి కాని యువతీ యువకులు దొంగ పెళ్లి చేసుకునైనా సరే అమెరికా వెళ్ల్లటానికి చేసే ప్రయత్నాలు నవ్వు , జాలి కలుగ చేస్తాయి.  గుణ్ణం గంగరాజు కధ, చంద్రశేఖర్ ఆజాద్  చిత్రానువాదం, మాటలు, నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.ఈ నాటకం  ప్రారంభ పాట చూడండి.


Adagaka Ichina Manasu Title Song
Uploaded by tvserialsongs. - Watch feature films and entire TV shows.వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి