శుక్రవారం, మే 09, 2008

సెల్ వైరాగ్యం -1


Cartoon courtesy: kimandjason.com

పేపర్లో రంగు రంగుల ప్రకటన. నొకియా వారి సరి కొత్త సెల్, కొత్త ఫీచర్స్ తో, తక్కువ ధరలో. పోయిన సంవత్సరం ఇలాంటి సెల్ ఇరవై వేలకి అమ్ముడు పోతే, ఇప్పుడు పది వేలకే.కళ్లు వద్దన్నా మరల మరలా పేజ్ లోని, ఆ ప్రకటన వైపే పోసాగాయి. మిత్రులంతా ఏమి రావుగారు, ఎప్పుడు సెల్ కొంటారు? ఇప్పుడు అది విలాస వస్తువు కాదండీ, నిత్యావసర వస్తువని బెదర కొట్తుంటే, ఎమో సెల్ లేని జీవితం, జీవితమే కాదనిపించిన బలహీన క్షణాన, ఛార్మీ కూడా చెపుతుంది మంచి షాపని Large D కి వెళ్లి ధైర్యంగా, మంచి సెల్ చూపండి అన్నా.

వెంటనే అరడజను సెల్ ఫోన్లు కౌంటర్ పై ప్రత్యక్షమయ్యాయి. అన్నీ ఒక దాన్ని మించి మరొకటున్నాయి.అబ్బ ఎన్నెన్ని ఫీచర్లో. ఈ ఫీచర్లన్నీ ఎప్పుడు ఎలా నేర్చుకోవాలో ఏమిటో అనుకున్నా. అంతలోనే, సెల్ కొనేసుకుంటే ఆ ఫీచర్లన్నీ ఎంతసేపు; అన్నీ ఇంట్లో కూచుని అభ్యాసం చెయ్యవచ్చు కదాని, రంగు రంగుల నొకియా కేవలం పది వేలకే అమ్ముతుంటే కొనకుండా ప్రవరాఖ్యుని కైనా సాధ్యమా అనుకుని, నాకు నేను భుజం తట్టుకుని, ఆ అది చూపండి అన్నా. కౌంటర్లో అమ్మాయి కి మాటలు బాగా వచ్చు. మంచిది సెలక్ట్ చేసుకున్నారండీ. అది కొంటే మీకు రెండు స్కిన్స్ ఉచితం అంది. సిన్సా అన్నా. కాదండీ ఆ సెల్ కొంటే ఈ రెండు రంగుల తొడుగులు ఉచితం. మీకు మాచ్ అయ్యేలా వున్న కవర్ సెల్ కు కు వేసుకోవచ్చు అంది. మా ఆవిడేనా ఎప్పుడూ మాచింగ్ వేసుకునేది -నేను ఇప్పుడు మాచింగ్ కవర్లేసుకోవచ్చనే వుత్సాహంతో - అమ్మాయ్, ఆ సెల్ పాక్ చెయ్యి అన్నా. కౌంటర్ అమ్మాయి, సార్ అది కొంటే మీకు ఒక టీషర్ట్ కూడా వుచితం అంటే నేను అమితానందభరితుడునై, ఆ సెల్ కు ఆ అమ్మాయి చెప్పిన ధర, మారుమాట్లాడకుండా, చెల్లించివేసా.

ఇంటికి వచ్చాక అధ్యాపక పుస్తకం (Instructions Manual) చదువుతూ ఇవన్నీ ఎంతలో నేర్చుకోను అనుకున్నా. ఆ ఫీచర్లన్నీ చదువుతుంటే అవన్నీ వాడటానికి ఈ జీవితకాలం సరిపోవునా అనిపించసాగింది. కొన్నయితే, అసలు ఈ ఫీచర్ తో నాకు పనేమిటి అనిపించింది. అలా లెక్కేసుకుంటే,పనికి వచ్చేవాటి కంటే అందులో మనకు పనికి రాని, జీవితంలో వుపయోగించని ఫీచర్లే ఎక్కువ వున్నట్లుగా తోచసాగింది. అరే! ఇదేమిటి, షాపు లో ఆ అమ్మాయి చెపుతుంటే ఇన్ని ఫీచర్లతో జన్మ ధన్యం కదా అని అప్పుడు అనిపించింది అని మనసులో మధన మొదలయ్యింది. సరి, మనం ఫీచర్ వాడుకోకపోతే, దానికి నోకియా వాడేమి చేస్తాడు. వాడితే వాడుకో లేకుంటే లేదు అని మనస్సు సర్ది చెప్పుకున్నా.

సరే ఇహ connection తీసుకోవాలని Sodatel కంపనీకెళ్లా.వారు నా బాంక్ statement , ఇంటి కాగితాలు, నా ఛాయాచిత్రం వగైరా తీసుకున్నాక,verification అవ్వాలి;అయ్యాక కనెక్షన్ ఇస్తామన్నారు. వాళ్ల ఏజెంట్ వచ్చి ఇల్లు స్వంతమా కాదా అని ధృవీకరించుకుని రిపోర్ట్ పంపాక నా కనెక్షన్ యాక్టివేట్ చేశారు. అమ్మయ్య! ఎట్టకేలకు సెల్ సొంతదారుడినయ్యా. ఈ విషయం మితృలకు ఎలా తెలుస్తుంది? ఒక ఆదివారం సాయంత్రం అందరినీ ఇంటికి తేనీరుకు పిలిచి, నేను ఇప్పుడు సెల్పతి (సెల్ + పతి) నయ్యానని స్నేహితుల హర్షధ్వనుల మధ్య ప్రకటించా. అందరూ అభినందనలు తెలుపుతుంటే గర్వంతో వుప్పొంగిపోయా.

సెల్పతి అయ్యా కాని ఒక్క ఫోన్ కూడా రావటం లేదేమిటి అని ఆలొచనలో పడ్డా. ఎందుకా దిగులు, మీ స్నేహితులకు మీ నంబర్ ఇచ్చారు కదా! వారే అవసరమైనప్పుడు చేస్తారు లెండి. అదే పనిగా ఫోన్ ఎదురుగా కూర్చుంటే ఏమిటి ప్రయోజనం. ఫోన్ ను స్టాండ్ (మిత్రుడు కొండపల్లి వెళ్తుంటే సెల్ వుంచటానికి ప్రత్యేక కొయ్య స్టాండ్, అందమైనది తెప్పించా.) పై పెట్టి మీ మిగతా పనులు కానిమ్మనమన్న శ్రీమతి సలహాపై, సెల్ స్టాండ్ లో పెట్టి లేవ బోతుండగా వచ్చింది ఫోన్. అమ్మయ్య, సెల్ కొన్న కష్టం వృధా పోలేదు. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడని, వుత్సాహంగా ఫోన్ తీసుకుని, ఠీవిగా ఆకుపచ్చ బటన్ నొక్కి, రాజసం వుట్టిపడుతూ, హెల్లొ అన్నా. అవతలినుంచి అమ్మాయి గొంతు -అపరిచిత నాకు ఎందుకు ఫోన్ చేస్తుంది? అని సందేహం! రావుగారు కావాలండీ అన్నదా అమ్మాయి. 'మాట్లాడుతున్నా’; 'మా కంపనీ వారు కొంతమంది అదృష్టవంతుల పేర్లు లాటరీలో తీసారండి. మీరు లాటరీ లో సెలక్ట్ అయ్యారు.మీరు మీ శ్రీమతి తో కలిసి మా క్లబ్ కు పలాన రోజు, పలాన టైం కొస్తే, మా ప్రతినిధులు మీకు మా హాలిడే హోంస్ గురించి వివరిస్తారండీ.అంతే కాదు మీకు ఏడు రోజులూ ఉచిత వసతి సౌకర్యం ఇస్తారు; మా మూడు నక్షత్రాల హాలిడే హోంస్ లో. మీరు తప్పక రావాలి.' ఇదీ ఆ ఫోన్ సారాంశం. ఫోన్ కొంటం తోటే అదృష్టవంతుడినయినందుకు నన్ను నేనే అభినందించుకున్నా. (To be continued)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి