శనివారం, మే 10, 2008
సెల్ వైరాగ్యం -2
సెల్ ఫోన్ చిట్కాలు చిత్రం: కంప్యూటర్ ఎరా సౌజన్యంతో
ఆ మరుసటి రోజు సాయంత్రం నేను, నా శ్రీమతి వారు చెప్పిన టైం కి ఠంచన్ గా వెళ్లాం. మాకు దొరికిన స్వాగతానికి మురిసి, ముక్కచెక్కలయ్యా.ఇదంతా సెల్ తెచ్చిన అదృష్టం అని మురిశా.హాలిడే క్లబ్ వారు మమ్ములను సాదరంగా తోడ్కొని పోయి, అతిశీతలగదిలో కూర్చోపెట్టి, చల్లని పానీయాలిచ్చి మర్యాదలు చేసి వారి కంపనీ గొప్పలు గురించి, చెప్పింది చెప్పకుండా, అరగంట ఎకరువు పెట్టారు.ప్రపంచమంతా వారికి శాఖలున్నై. అందులో సభ్యత్వం తీసుకోమనీ, తీసుకుంటే మమ్మల్ని తెలివైన వారిగా ప్రపంచం గుర్తిస్తుందనీ,సభ్యత్వం ఆ రోజు చాలా చవకలో వస్తుందనీ, మరో వారంలో రెట్టిపవుతుందనీ, మమ్మలని సభ్యత్వం తీసుకోమని వత్తిడి చెయ్యసాగారు. సిమ్లా లో వుండటానికై మాకు నాలుగు రోజుల ఉచిత ఆహ్వానం కూడ ఇచ్చేశారు. మాకు ఆలొచించటానికి కూడా, వారు టైం ఇవ్వటానికి సిద్ధంగా లేకపోతే, వారు ఇస్తామంటున్న విందుభోజనం కూడా వద్దనుకుని ఇంటికి వచ్చేశాము.
కొత్త బిచ్చ గాడు పొద్దెరగడన్నట్లుగా, సెల్ ఎదురుగా కూర్చుని ఎవరూ ఫోన్ చేయరేమిటి అని చూస్తుంటే ఫోన్ మోగింది. ఉత్సాహంగా హెల్లో అన్నా. అవతల ఇంకో అమ్మాయి గొంతు తనను; తను పరిచయం చేసుకున్నది. ఎంత మంచిదో అని సంతోషించా. ఎదో కార్ ఫైనాన్స్ కంపనీ అంట, కార్ లోన్ ఇస్తాము, మీకు ఏ కారు కావాలి అని అంది;వరాలిచ్చే దేవత లా. కారా! నా కెందుకు తల్లీ, నాకు నిక్షేపం లాంటి స్కూటర్ వుంది; ఎక్కడికెళ్లాలన్నా దాని మీద వెళతా. కారు అవసరం లేదన్నా. అయ్యో, ఎన్నాళ్లు ఇలా స్కూటర్ తో అవస్థలు పడతారు, కారయితే, ఎండా, వాన బాధలుండవుగా అంది,నన్ను తెలివిగా ముగ్గులోకి దించుతూ. సరెనమ్మా, మీ కంపనీ వారు వడ్డీ ఎంత తీసుకొంటారేమిటి అన్నా. అబ్బే ఎంతండీ, ధర్మ వడ్డీ 10% flat అంతేనండీ అంది. సంతోషంతో వుక్కిరిబిక్కిరయ్యి బాంక్ అప్పారావు దగ్గరికి పరిగెత్తా. ఏమిటయ్య మీ బాంకు గొప్పా? ఫలాన ఫైనాన్స్ వారు ధర్మవడ్డీకే ఇస్తున్నారని, ఆ అమ్మాయి చెప్పినదంతా చెప్పా. అప్పారావు కాగితం కలం తీసుకుని 10% ఫ్లాట్ అంటే, సంవత్సరానికి ఎంత వడ్డీయో లెక్క వేసి చెప్పేసరికి, కళ్లు బైర్లుగమ్మాయి.
ఆ మర్నాడు సెల్ విషయం మరిచి, పేపర్ తిరగెస్తుంటే సెల్ మోగింది. మరలా అమ్మాయి గొంతే. ఎదో బంగారం షాపు పేరు చెప్పింది. అక్షరతృతీయంట.మంచిరోజంట. ఆ రోజు, మజూరీ లేదు, తరుగు లేదు, డయమండ్స్ పై 2.5% ప్రత్యేక తగ్గింపనీ, మా కోసం నిరీక్షిస్తామనీ చెప్పింది.అమ్మయ్య బ్రతికిపోయాను. ఈ ఫోనే కనుక మా ఆవిడ తీసుంటే బుక్ అయిపోయేవాడినని, కనబడ్డ రాయికల్లా మొక్కా.
ఆ సాయంత్రం ఫోన్ మోగింది. తమాషాగా ఈ సారి మొగ గొంతు.సెల్పతినన్న గర్వంతో హెల్లౌ అన్నా. నేను చలపతిని.కోల్కత్తా నుంచి మాట్లాడుతా.PCO నుంచి మాట్లాడుతున్న. కాయిన్స్ అయిపోయాయి. నన్ను అర్జెంట్గా ఫోన్ చెయ్యమని అర్థింపు.సరే పాతమిత్రుడు కదాని నా సెల్ లోంచి మాట్లాడితే, అరగంట వాడి బాధలేకరవు పెట్టాడు.ఎంత ఫోన్ బిల్ అవుతుందో అని మనసులో వున్నా, వాడి బాధ చెప్తుంటే, నా బిల్ గురించి చెప్పటం మానవత్వం కాదనిపించింది.
చలపతితో మాట్లాడాక సాయం వాహ్యాళి కై పార్క్ కెళ్లా. రాంగానే ఫోన్ మోగింది. ఈ సారి ఫోన్ సోడాటెల్ కంపనీ నుంచి. ఫోన్ లో పరిమితికి మించి వాడకం జరిగిందనీ,కంపనీ కి వచ్చి సెక్యూరిటి డిపాజిట్ కట్టాలనీ లేకపోతే ఫోన్ డీయాక్టివేటవుతుందనీ హెచ్చరిక వినిపించింది. ఇదేమిటి! post paid bill option వున్నప్పుడు పరిమితి అయిందంటాడేమిటి? (పోస్ట్ పైడ్ కు పరిమితులుంటాయని ముందస్తుగా చెప్పాలి.) ఫోన్ కంపనీ వాళ్లు నాకు చెప్పలేదే అనుకున్నా. అసలు నేను అంతగా ఫోన్ వాడనేలేదుగా, అనుకున్నా. ఫోన్ కంపనీకి ఫోన్ చేసి డబాయించా. వారు నా బిల్ అప్పుడే 1275 రూపాయలు అయ్యిందని చెప్పారు. అంత బిల్ ఎట్లా అవుతుంది? నేనసలు అన్ని కాల్స్ చెయ్యలేదుగా అనుకుని మధనపడుతున్న సమయం లో, శ్రీమతి వస్తే జరిగింది చెప్పా. నువ్వేమన్న ఫోన్స్ చేసావా అని అడిగా. లేదండీ, మా తమ్ముడొస్తే వాడేదో అమెరికా ఫ్రెండ్ కు ఫోన్ చేస్తానంటే సెల్ ఇచ్చానండీ; అంతే, అని చావు కబురు చల్లగా చెప్పింది.
ఆ మర్నాడు స్నేహితుడి ఇంటి కెళ్లా, ఎదో పనిపై. సుందర్ తో ఆ కబుర్లు, ఈ కబుర్లు అయ్యాక, అక్కడే భోజనం చెయ్యమని బలవంతపెడితే, ఉండవోయ్, మీ సిస్టర్ కు ఓ మారు ఫోన్ చేసి చెప్తా అని స్టైల్ గా సెల్ తీసి డయల్ చేస్తే, ' మీ అక్కౌంట్ తాత్కాలికంగా ఆపివేయబడినది.డిపాజిట్ చెల్లించి మరల ఎక్కౌంట్ పునః ప్రారంభించగలరు ' అని సందేశం వస్తే బిత్తర పోవటం నా వంతయ్యింది.సరే వీడి సంగతి భోజనం అయ్యాక పడ్తా అనుకొని, భొజనం గావించి, సోడాటెల్ కార్యాలయానికి వెళ్లి, వారెందుకు ముందస్తుగా చెప్పలేదని దబాయించా. మేము చెప్పడ మేమిటి, అన్నీ చదివే గదా కదా మీరు అగ్రీమెంట్ పై సంతకం పెట్టారు, అని వాళ్లు నన్ను ఉల్టా డబాయించేసరికి పరేషాన్ అయిపోయా. చెప్పొద్దూ, అప్పుడు గుర్తొచ్చింది, కనెక్షన్ ఇవ్వటానికి ముందు, 8 పేజీల అగ్రీమెంట్ పై సంతకం పెట్టించుకున్న విషయం గుర్తుకొచ్చింది. మామూలుగా ఐతే ఇలాంటి ఒప్పందాలు చదువుతా. ఐతే, ఆ ఒప్పందం, చిన్న అక్షరాలతో వుండటంతో, అది చదివేసరికి నీరసం రావటం ఖాయమని,గుడ్డిగా చదవకుండానే సంతకం పెట్టేసి, ఇప్పుడిట్లా దొరికిపోయా. వారు చెప్పినట్లే డిపాజిట్ కట్టి, చావు తప్పి, కన్ను లొట్ట పోయిన వాడిలా ఇంటికి చేరా. (To be continued)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
baagumdi
bolloju baba
కామెంట్‌ను పోస్ట్ చేయండి