శనివారం, మే 24, 2008
సెల్ వైరాగ్యం -3
Sexy Future Mobile
మధ్యాహ్న భొజనమయ్యాక కొంచం కునుకు తీయటం అలవాటు. 10 నిమిషాలు పడుకున్నానో లేదో, ఎదో కొంపలు మునిగినట్లుగా, ఫోన్ మోగింది. ఈ టైం లో ఎవరు చేస్తున్నారబ్బా అనుకుంటూ ఫోన్ ఎత్తా. షరా మాములే. రావుగారేనా మాట్లాడుతుంది? ఆ, అవును, రావునే మాట్లాడుతున్నా. 'నేను సామ్యూల్ ను. ఆల్రైట్ బాంక్ నుంచి మాట్లాడుతున్నా. మా కస్టమర్ డిపార్ట్మెంట్ వాళ్లు, మీ యొక్క అకౌంట్ నిర్వహించిన తీరు చూసి,ముచ్చెరువై, మీకు బాంక్ క్రెడిట్ కార్డ్ ఇవ్వాలని ఏగ్రీవంగా తీర్మానించారేశారు కావున, మీకు ఈ సాయంత్రం కొరియర్ లో వచ్చే కార్డ్ అందుకోగలరు.' అని ఫోన్ పెట్టేశాడు. వీడి దుంపతెగ. నేను కార్డ్ కావాలని అడగకుండా పంపుతాడేమిటి అని వాడి మీద పీకల్దాకా కోపమొచ్చేసింది. మా ఫ్రెండ్ సుబ్బారావు క్రెడిట్కార్డ్ తో ఎలా అప్పులపాలయ్యోడో ఆఫీస్ లో అంతా కథలు కథలు గా చెప్పుకుంటుంటే విన్నా. చస్తే, క్రెడిట్ కార్డ్ తీసుకోగూడదని తీర్మానించేసుకున్నా. అట్లాంటిది, నాకే వీడు కార్డ్ పంపుతాడు, నన్నడగకుండా.
ఆ మర్నాడే కార్డ్ తీసుకుని ఆల్రైట్ బాంక్ కు వెళ్లా. కౌంటర్ లో అబ్బాయినడిగితే, మేనేజర్ను కలవాలన్నాడు. కలుస్తానంటే, కూర్చోమన్నాడు. ఐదు నిమిషాల తర్వాత పిలుపొచ్చింది, మేనేజర్ నుంచి. రూం లోకి వెళ్తూనే చల్లగా అనిపించింది. మేనేజర్ కూర్చోమన్నాడు.ఆఫీస్ బాయ్ చల్లటి నీళ్లు తెచ్చాడు, తాగటానికి. నా కోపం చల్లారింది. వచ్చిన విషయం చెప్పా. 'ఏమి ఫరవాలేదు. మీకు అవసరమైనప్పుడు వాడుకోండి. Card renewal fee లేదు, అంతా ఉచితం అని, ఇవ్వాళ మీరు ఎదైనా వస్తువు కొంటే, గడువు లోపల పైకం చెల్లిస్తే వడ్డీ కూడా లేదు సార్.మీకంతా లాభమే.' అని సాగనంపాడు. నేను కూడా వాడితే కదా, మనము దీని ఊబిలో పడేది, లేకుంటే లేదు అని సమాధాన పరచుకొన్నా. ఆ పై ఈ క్రెడిట్ కార్డ్ తో నా కష్టాలన్నీ రాయాలంటే, అది క్రెడిట్ కార్డ్ వైరాగ్యం అంత పెద్ద వ్యాసం అవుతుంది కావున, దాని జోలికి ఇప్పుడు పోవటం లేదు.
సెల్ కొన్నాక ఒక విషయం అర్థమయ్యింది. నేను సెల్ కొనటం ఈ కంపనీల వాళ్లకి పండగయ్యింది, నాకు కాదు. ఎందుకంటే, నాకు వచ్చిన ఫోన్స్‌లో మిత్రుల ఫోన్స్ తక్కువ, కంపనీలవి ఎక్కువ కనుక.ఆ రోజు మధ్యాహ్నం, భోజనం లో నాకు నచ్చిన గుత్తి వంకాయకూర,మునక్కాయ పులుసు, ముద్దపప్పు ల తో మా ఆవిడ నాకు అరచేతిలోనే స్వర్గం చూపే సరికి, గుర్రెట్టి నిదురిస్తున్న సమయం లో సెల్ మోగింది. మధ్యాహ్నం ఎవడురా, నిద్ర పోనీకుండా ఫోన్ చేస్తాడు అని విసుక్కుంటూ, ఫోన్ ఎత్తా. 'గుడ్ ఆఫ్టర్‌నూన్, రావుగారు కావాలి’ ''మాట్లాడుతున్నా” ' నేను సంజన, బాంక్ ఆఫ్ కెనడా నుంచి మాట్లాడుతున్నా. మీకు మా బాంక్ వారు నాలుగు లక్షల రూపాయలు అప్పు మంజూరు చేశారు. నో గ్యారంటీ. కొన్ని కాగితాల మీద సంతకం పెట్టి, 18 బ్లాంక్ చెక్స్ ఇస్తే చాలు. మా బాంక్ ఎక్జిక్యూటివ్ ను మీ ఇంటికి ఎప్పుడు పంపమంటారు? ‘అని గడ గడ చెప్పేస్తే - నాకు తిక్క రేగింది. నేను అప్పు అడగ లేదు, అవసరం లేదు. ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తారని అడగబోయి,అవతలున్నది అమ్మాయని గుర్తొచ్చి,' నా ఫోన్ నంబర్ మీకు ఎలా తెలిసింది? నాకు లోన్ ఇవ్వాలని మీకు అనిపించటానికి, నా గురించి మీ కేమి తెలుసు?' అని అడిగా. దానికి బదులుగా సంజన ఓ చిర్నవ్వు నవ్వి, ‘అవన్నీ మా P.R.O. శాఖ చూసుకుంటుంది , నా పని మీ లాంటి విలువైన ఖాతాదారు లకు ఫోన్ చెయ్యటమే ' అని విసుగు లేకుండా, మరలా నవ్వుతూ చెప్పింది. 'మీ బాంక్ ఎంత వడ్డీ వసూలు చేస్తారు? మిగతా వివరాలేమిటి?' అని అడిగా. ‘19% p.a., Loan processing charges, premature closing penalty వగైరాల గురించి చెప్పింది.' ‘అది సరేనమ్మా, ఇలా ముక్కూ, ముహం తెలియని వాళ్లకిలా అప్పులిస్తే, వాళ్లు ఎగవెస్తే ఎట్లా? ‘అన్నా, అమాయకంగా, నేనో సత్య హరిశ్చంద్రుడిలా. దానికి మా వద్ద ప్రత్యేక శిక్షణ పొందిన, వుద్యోగులతో కూడిన, Loan Recovery Cell వుంది.అప్పు ఎగ్గొట్టే వాళ్ల పని, వాళ్లు చూసుకుంటారులెండి ' అంది నన్ను ఓదారుస్తున్నట్లుగా. సరే, నాకు అవసరమైతే ఫోన్ చేస్తా, అని ఫోన్ పెట్టేశా. తర్వాత, బాంక్ అప్పారావు చెప్పాడు, ఈ ప్రైవేట్ బాంక్లు వాళ్లు , loan recovery కి ఎన్ని చిత్ర, విచిత్ర,దుర్మార్గమైన పనులు చేస్తారో చెప్పేసరికి,సంభ్రమంతో,నోరు తెరిచా. సంజన విజయవంతంగా నా మధ్యాహ్న నిద్ర, భంగం గావించగలిగింది. ఇప్పటికీ నాకు అంతు బట్టని విషయం, నా మిత్రులకే ఇంకా సరీగా తెలియని నా సెల్ ఫోన్ నంబర్, నా credit worthiness ఈ ఫోన్ చేసే వాళ్లకు ఎలా తెలుస్తున్నాయని. నన్ను మాటి మాటికీ విసుగించే, ఈ ఫోన్స్ నుంచి రక్షించేందుకు, ఏదన్నా వ్రతముందేమో తెలపాలని, జ్యోతక్కకు వెంటనే వుత్తరం రాశా. (To be contd)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 కామెంట్‌లు:
వెరీ గుడ్. మీ సెల్ ఫోన్ వైరాగ్యం ఎపిసోడ్ కోసం ఎక్కువగా ఎదురు చూసేది నేను! టీవీ సీరియల్ లా భయపెట్టకుండా చాలా హాయిగా రాస్తున్నారు.
- sujata
ఇలాంటి dry subject తో పాఠకులను ఆకట్టుకోవటం కష్టమైన పని. కొంతమందికైనా ఇది నచ్చుతున్నందుకు సంతోషం. మీరేమిటి అనానిమస్ గా సుజాత అని రాసారు? సుజాత ఎవరు? మీరు బ్లాగర్ సుజాతైతే, ఏ సుజాత?
మీ వ్యాసం తమషాగా ఉంది.
ఫోన్ ఉన్నా ఎవడూ చేయడేమి అనుకునేవాడిని పదేళ్ళ క్రితం. ఈ ప్రయివేట్ బ్యాంకుల పుణ్యమా అని ఒక్కోసారి ఫోన్ లేకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది:)
nenu sir. ninna na pasword blogger ki gurtu raledu. enni sarlu naa id to comment raddamanna fail aindi.
naaku mee sell-vairagyam modatininchee nacchindi.
ఇందులో వున్న సంఘటనలు భారత్ లో వున్నవారికే పరిమితమనుకుంటా. మీకు అంటే U.K. లో ఇలా unwanted calls చెయ్యటం చట్టసమ్మతం కాదనుకుంటా(?).మీకు ఈ బాధలుండవు; అయినా ఈ వ్యాసం మీకు నచ్చినందుకు ప్రమోదం.మీ profile ద్వారా మీరు ఎవరో గుర్తించా. కాని ప్రతిసారి చూడటం కన్నా, మీ ఇంటిపేరుతో కలిపి మీ పేరు రాయగలరు. ఈ identity crisis తొలగకలదు.నాతో పోటీగా, ఎక్కువ టపాలు రాస్తున్నందుకు అభినందనలు.
రావు గారు మీరు అన్నట్లు ఇది DRY సబ్జక్ట్ కాదు. ప్రస్తుతం అందరు పడుతున్న బాధే. తీసు కొన్న లోన్ మొత్తం వడ్డి తో కట్టడానికి కూడా మనం PRE-MATURE PENALTIES కట్టమని అంటున్నారు. అదేమీ వింతో అర్థం కావడం లేదు. ఇక దౌర్జన్యం సంగతంటారా.. మనకి మాత్రం చేత కాదంటారా?? అంత దాకా వస్తే .. అన్ని PARTS తో GUARANTEE గా తిరిగి వెళ్ళలేరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి